KOPPULA: జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెగడపల్లి నుంచి మల్యాల వరకు 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులు, నరసింహునిపేటలో 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాజకీయ నేతలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా కృషిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మన ఊరు– మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి తెలిపారు.
కుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అనేక చోట్ల కుల సంఘాల భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయని వెల్లడించారు. పాడుబడిన స్థితిలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కేసీఆర్ అహర్నిశలు ప్రజలకోసమే పాటుపడుతున్నారని స్పష్టం చేశారు. దేశంలో కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని మరోసారి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్రంలో నిధుల కొరత లేదని తెలిపారు.