RRR Oscar దర్శకధీరుడు రాజమౌళి తెర అర్ఆర్ఆర్ సినిమా లో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత దేశం అంతా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే ఈ విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర బృందాన్ని సన్మానిస్తామంటూ చెప్పుకొచ్చారు.
ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంతా సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ చిత్ర బృందానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలుపుగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అవార్డ్ లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అందరికీ స్వీట్లు పంచి ఆనందం పంచుకున్నారు.
ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి తలసాని.. ఆస్కార్ అవార్డును అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రంగా RRR చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుందని చెప్పారు. ఆస్కార్ అవార్డును అందుకున్న గొప్ప చిత్రం RRR. ఈ చిత్రాన్ని నిర్మించిన డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు. అలాగే చిత్రబృందానికి సన్మానం జరిపిస్తామని చెప్పుకొచ్చారు..