తెలంగాణ బాష , సాహిత్యం , సంస్కృతిని ప్రతిబింబించడంతో పాటు మన గౌరవానికి తగినట్లుగా ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు . ప్రధాన వేదిక అయిన లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ప్రాంగణంలో సభలు జరిగిన అయిదు రోజులు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ తెలుగు మహా సభలు తెలంగాణ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని, నూటికి నూరు శాతం ఆహ్వానితులను తగు రీతిలో గౌరవించాలని, సౌకర్యాలు కలిగించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాన ఘట్టాలైన ప్రారంభ సమావేశం, ముగింపు సమావేశాల విషయంలో నిర్ణయాత్మకంగా వుండాలని, ఇదొక బహుముఖమైన కార్యక్రమం కాబట్టి ఎక్కడా ఏ లోటు రాకుండా జాగ్రత్త పడాలని సిఎం అన్నారు. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వస్తున్నారని, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ , మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావు విశిష్ట అతిథులుగా వసున్నారని, ప్రపంచ తెలుగు మహా సభల ప్రారంభ ప్రకటన ఉప రాష్ట్రపతి చేయగానే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చాలని ముఖ్యమంత్రి అన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ర్యపతి రామ్ నాథ్ కోవింద్ వస్తున్నారని సిఎం చెప్పారు.
డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్ లో జరుగనున్న ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహక – సమీక్ష సమావేశం సోమవారం మధ్యాహ్నం సుమారు 4 గంటల పాటు ప్రగతిభవన్ లో జరిగింది. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, హరీష్ రావు, చందూలాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలా చారి, సాంస్కృతిక సారథి అధ్యక్షుడు రసమయి బాల కిషన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మైనింగ్ కార్పోరేషన్ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవుల పల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎస్.వి. సత్యనారాయణ, సిఎంఓ ఓ.ఎస్.డి.దేశపతి శ్రీనివాస్, టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, డిజీపి మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, హెచ్ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు తదితరులు హాజరయ్యారు.
సాహిత్య అకాడమీ చైర్మన్, ఇతర నిర్వహకుల నుంచి సమావేశాల సన్నాహక కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ దేశాల నుంచి ఎంత మంది ప్రతినిధులు, పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ప్రతినిధులు వస్తున్నారని అడిగారు. మొత్తం సుమారు ఎనిమిది వేల మంది హాజరవుతున్నట్లు వారు చెప్పారు. ప్రధాన వేదిక ఎల్.బి. స్టేడియం తో సహా మిగిలిని అన్ని వేదికల పర్యవేక్షణ బాధ్యత ఒక్కోక్కరు తీసుకోవాలని, అలానే భోజనాలు, బస, ఇతర లాజిస్టిక్స్, ఏ సమస్య లేకుండా చూసుకోవాలని సిఎం అన్నారు. వివిధ వేదికల వద్ద జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతినిధులకు అక్కడికి చేరుకోవటానికి, ఆ తరువాత సాయంత్రం పూట ప్రధాన వేదిక ఎల్.బి.స్టేడియం చేరుకోవటానికి తగువిధమైన సౌకర్యం కల్పించాలని సిఎం సూచించారు. ప్రతి ప్రతినిధితో మాట్లాడి వారి అభిలాష కనుక్కుని దానికి అనుగుణంగా ఎవరెవరు ఎక్కడికి వెళతారో ఆ విధంగానే రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పారు. సాయంత్రం ఎల్.బి.స్టేడియంలో జరిగే కార్యక్రమాల ప్రారంభ సమయానికి ఒక గంట ముందుగానే ఇతర వేదికల వద్ద కార్యక్రమాలు ముగింపు ఉండేలా చూడాలని సిఎం అన్నారు. ఎల్.బి.స్టేడియం వద్ద ప్రతిరోజు తెలంగాణ మీద ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరిని ప్రదర్శించాలని, సాహిత్య కార్యక్రమాలు, కళాకారుల పరిచయాలు జరగాలని సిఎం అన్నారు.
విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులు ఎవరెవరు ఎన్ని రోజులు ఎక్కడెక్కడ వేదికల వద్ద జరిగే సభలకు హాజరవుతారో వివరాలు రూపొందించి దానికి అనుగుణంగానే సౌకర్యాలు కలిగించాలని సిఎం అన్నారు. విధేశి ప్రతినిధులకు రవాణా కొరకు కార్లు ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు. ప్రధాన వేదిక అయిన ఎల్.బి. స్టేడియం కు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, ఇతర సాహిత్యాభిలాషులు హాజరవుతారు కాబట్టి పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తులు తీసుకోవాలని, అలాగే పుడ్ కోర్ట్స్ ప్రారంభం నాటి నుంచే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పారు. అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటి చెప్పాలని, అయిదు రోజుల్లో ఒకనాడు పూర్తిగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలని సిఎం సూచించారు. వివిధ జిల్లాల నుంచి తెలుగు ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, ఆచార్యులకు, వివిధ రచయితల సంఘాల సభ్యులకు, తెలుగులో పాండిత్యం వున్న ఇతరులకు, సాహిత్యాభిలాషులకు మహా సభలకు హాజరయ్యేందుకు జిల్లా కలెక్టర్లు రవాణా, భోజన సౌకర్యం కలిగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల వున్న ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సాహిత్యాభిలాష వున్న వారిని సభలకు హాజరయ్యేందుకు వారికి సౌకర్యం కలిగించాలన్నారు. అభిలాష వుండి మహా సభలకు హాజరుకాదలుచుకున్న వారందరికీ వచ్చే వెసులుబాటు కలిగించాలని సిఎం చెప్పారు.
‘‘ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే’’ అన్న ప్రాతిపదికన సభలు నిర్వహించాలని, హాజరు కాదలుచుకున్న ప్రతి సాహిత్యాభిలాషి రావొచ్చన్న సందేశం పోవాలని సిఎం అన్నారు. ప్రారంభ, ముగింపు సమావేశాలు జరుగుతున్న ఎల్.బి.స్టేడియంలో విదేశీ, ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు ప్రత్యేక సీటింగ్ అరెంజ్ మెంట్ వుండాలని, అలానే నమోదు చేసుకున్న ఇతర ప్రతినిధులకు మరో ఎన్ క్లోజర్ వుండాలని, మహిళలకు ఒక ప్రత్యేకమైన ఎన్ క్లోజర్ వుండాలని, వివిధ సాహిత్య వేదికల్లో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే వారికి మరో ఎన్ క్లోజర్ వుండాలని, మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఒక ఎన్ క్లోజర్ వుండాలని, ప్రెస్ గ్యాలరి ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు.
13 భారతీయ గుర్తింపు పొందిన భాషల్లో జ్ఞాన్ పీఠ్ ఆవార్డు బహుమతి గ్రహీతలను వివిధ రాష్రా ాల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించి తగు రీతిలో సత్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంత మంది ఇతర భాషల వారిని సన్మానం చేశామన్న కీర్తి తెలుగు మహా సభల సందర్భంగా మనకు దక్కాలని సిఎం అన్నారు.