హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. నల్లగండ్ల రేడియల్ రోడ్‌కు మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, స్థానిక కార్పొరేటర్ లు ఈ సందర్భంగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఔటర్ కు వెలుపల 350 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. గ్రోత్ కారీడార్‌ను మరో 2 కిమీ పెంచుతామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు వెంటన పార్కుల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎస్ఆర్డీపీ కింద మరిన్ని రోడ్లు నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. హైదరాబాద్ నగరానికి మణిహారం గా మారిన బాహ్యవలయా రహదారి 159 కిలోమీటర్లు పూర్తి కావచ్చిందన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు ను కలుపుతూ ఈ రేడియాల్ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. రూ.152 కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నామన్నారు. దీనిని త్వరగా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖను కోరుతున్నట్లుగా తెలిపారు. దీని ద్వారా ఐటీ ఉద్యోగులకు చాలా ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు.
గ్రీడ్ రోడ్స్, రేడియల్ రోడ్స్ తొందరగా నిర్మించితే ఐటీపరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో మనం కూడా ఉంటాంమన్నారు. గ్రోత్ కారిడార్ ను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విస్తరించినట్లు తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలు లేకుండా పక్కా మాస్టర్ ప్లాన్ వేసి ముందుకు పోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రిడ్ రోడ్ ను పూర్తి చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరంలో అన్ని రోడ్లు, ఇతరత్రా పూర్తిచేసి ప్రారంభిస్తామని తెలిపారు.