దావోస్‌లో జరుగుతున్న వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామరావు పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన ప్రారంభోత్సవ ఫ్లీనరీ సమావేశంలో మంత్రి హాజరయ్యారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పలు దేశాల అధినేతలు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పడిన మూడున్నరేళ్లలో వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులకు అహ్వానం తెలంగాణ రాష్ర్టానికి వస్తున్నప్పటికీ, ఈ సారి తొలిసారిగా దావోస్ సదస్సుకు రాష్ర్టం తరపున హాజరవుతున్నట్లు మంత్రి కే తారకరామరావు తెలిపారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రాష్ర్టంలోని వ్యాపారనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ సదస్సులో భాగంగా పలు కంపెనీలతో సమావేశం అవనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ రోజు నుంచి 26 వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పలు సెషన్లలో ప్రసంగించనున్నారు. 25న జరగనున్న సెషన్ లో `లివరేజింగ్ డిజిటల్ టు డెలివర్ వాల్యూ టు సొసై`టీ అంశంపైన ప్రసంగిస్తారు. దీంతోపాటు అదే రోజు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పాల్గొననున్న రౌండు టేబుల్ కాన్ఫరెన్సు సమావేశంలో “ప్రమోటింగ్ డిజైన్ ఇన్ ఇండియా” అనే అంశంపైన మాట్లాడతారు.
వరల్ఢ్ ఎకానామిక్ ఫోరమ్ ప్రారంభ ప్లీనరీ అనంతరం మంత్రి కెటి రామారావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్, పారిశ్రామికదిగ్గజం ముకేష్ అంబానీతోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు.