బీసీలందరికీ రుణ ఫలాలు దక్కాలి. ఏదడిగితే అదే ఇద్దాం. కుల వృత్తుల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, కార్పోరేషన్ రుణాలు అందజేయడంలో నిజమైన అర్హులను గుర్తించాలని, చిరు వ్యాపారులందరికీ.. బహు ప్రయోజనం కలగాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం బీసీ, ఎంబీదీ- వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల వారికి జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధ్యక్షతన ఆర్థిక సాయం అందించే అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు హాజరై సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లబ్ధిదారులకు బ్యాంకు కాన్సెంట్ రాక ఇబ్బందులు ఉండేవనే., అంశాలపై ఎమ్మెల్యేలు, అధికారిక వర్గాలు తమ అభిప్రాయాలు తెలిపారు. వృత్తి రీత్యా యూనిట్లు అందజేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు వృత్తి లేనటువంటి వారు.. రుణ సదుపాయాలు పొందేలా కార్యాచరణ ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఎంబీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1000 బడ్జెట్ పెట్టారని చెప్పారు. అంతకు ముందు జిల్లాలోని సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మానకొండూర్, జనగామ నియోజకవర్గాల పరిధిలోని కేటగిరీలా వారీగా వచ్చిన దరఖాస్తులను వివరించారు. జిల్లా వ్యాప్తంగా 19వేల 712 దరఖాస్తులు వచ్చాయని, వీరిలో 11వేల 151 మందిని అర్హులుగా గుర్తించినట్లు మంత్రికి వివరించారు.
కేటగిరీల వారీగా సబ్సిడీ రుణాలపై ఆయా మండలాల ఎంపీడీఓలు గ్రౌండింగ్ చేయించాలని, రుణాలకు అర్జీలు చేసుకున్న వారు ఏదడిగితే అదే ఇద్దామని.. ఇందు కోసం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. 50వేల నుంచి 5లక్షల వరకూ రుణాల కోసం అర్జీ చేసుకున్న వారిలో 50వేల పరిమితి అడిగితే ఇబ్బందులు పెట్టొద్దని లబ్ధిదారులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సదస్సులో ప్రభుత్వ ఛీఫ్ విప్ వెంకటేశ్వర్లు, శాసన మండలి ఛీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ ఐఏఎస్ అవిశ్యంత్ పండా, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ ఈడీ చరణ్ దాస్, జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, వివిధ శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.