Home / 18+ / చిన్నపాటి గాలులకే అతలాకుతలం అవుతున్న అమరావతి.. తుఫాను వస్తే రాజధాని క్షేమమేనా.?

చిన్నపాటి గాలులకే అతలాకుతలం అవుతున్న అమరావతి.. తుఫాను వస్తే రాజధాని క్షేమమేనా.?

అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనానికి ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా నాసిరకం పనుల డొల్లతనం బయటపడుతూనే ఉంది. తాజాగా పెథాయ్‌ తుపాను వల్ల రెండురోజులుగా ఓ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో మళ్లీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌లోకి సోమవారం పైకప్పు నుంచి వర్షం నీరు చేరింది. దీంతో ఛాంబర్‌లోని ఫైళ్లన్నింటినీ మరో గదిలోకి మార్చారు. ఈ ఏడాది మే నెలలోనూ, అంతకుముందు కూడా పలుమార్లు కురిసిన చిన్న వర్షానికే జగన్ ఛాంబర్‌లోకి నీరు చేరింది. మొదటిసారిగా ఈ ఛాంబర్‌లోకి వర్షం నీరు వచ్చినప్పుడు వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు కావాలనే పైపులు కోసేశారని ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు.

అంతటితో ఆగకుండా ఈ సంఘటనను విద్రోహచర్యగా అభివర్ణించారు. అయినా విచారణకోసం ప్రభుత్వం సీఐడీకి అప్పగించినా సీఐడీ నివేదిక ఏమైందో కూడా తెలియలేదు. జగన్‌ ఛాంబర్‌లోకి పలుమార్లు వర్షం నీరు చేరిన నేపథ్యంలో సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ పాటు ఇతర అధికారులు ఆ చాంబర్ ను తనిఖీ చేశారు. ఆ సమయంలో మీడియాను అనుమతించకుండా ఆంక్షలు విధించడం కూడా విమర్శలకు దారితీసింది. పెథాయ్‌ తుపాను ప్రభావంతో కురిసిన చిన్నపాటి వర్షానికే జగన్‌ ఛాంబర్‌లోకి నీరురావడం అసెంబ్లీ తాత్కాలిక భవనాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా జగన్‌ ఛాంబర్‌లోకి వర్షంనీరు వచ్చిందన్న విషయం తెలిసి అక్కడికి వెళ్లేందుకు మీడియా ప్రయత్నించగా అసెంబ్లీ సిబ్బంది మళ్లీ అడ్డుకున్నారు. అలాగే అసెంబ్లీ ప్రధాన గేటు ఆర్చ్ కు సంబంధించిన టైల్స్ కూడా విరిగి పడిపోయాయి. ప్రస్తుతం ఈ జగన్ చాంబర్ లోకి నీరు చేరడం, అలాగే ప్రధాన ద్వారం వద్ద టైల్స్ విరిగి పడిపోవడం అలాగే గతంలో కురిసిన రెండ్రోజుల వర్షానికే రాజధాని నిర్మించాలనుకున్న ప్రాంతం మొత్తం నీటిలో మునిగిపోవడంతో ఇదంతా కళ్లారా చూస్తున్న రాజధాని ప్రజలు అమరావతి ప్రాంతంలో హుదూద్, తిత్లీ, పెథాయ్ వంటి తుఫానులు అమరావతిలో వస్తే మొత్తం రాజధాని అతలాకుతలం అవడం ఖాయం అని చెప్తున్నారు.