Home / SLIDER / హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి

హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి

హరితహారం కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామపంచాయతీలకు ప్రభుత్వ పరంగా నిధుల విడుదలలో, పనుల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అన్ని గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మంత్రి దయాకర్రావు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘హరితహారంతో వాతావరణవరణ పరిస్థితులు మారుతాయి. మళ్లీ వర్షాలు పెరుగుతాయి. హరితహారం విజయవంతం కావడానికి సమష్టిగా కృషి చేయాలి. నాటిన మొక్కల సంరక్షణ విషయంలో సర్పంచ్లు, అధికారులు చర్యలు తీసుకోవాలి. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆధారంగానే గ్రామపంచాయతీల ప్రత్యేక గుర్తింపు ఇస్తాం. జీపీ భవనాలు, సీసీ రోడ్లు వంటి అన్ని పనుల మంజూరులో ఈ గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి గ్రామపంచాయతీలో కచ్చితంగా హరితహారం నర్సరీని ఏర్పాటు చేయాలి. ఉపాధిహామీ నిధులను అత్యధికంగా వినియోగించుకునేలా పనుల ప్రణాళిక ఉండాలి.
 
ఆర్థిక సంవత్సరం ముగింపులో హడావుడిగా కాకుండా పక్కా ప్రణాళికతో ఎక్కువ పనులు చేయాలి. గోదాముల నిర్మాణం చేపట్టాలి. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.1406 కోట్ల ఉపాధిహామీ పనులు పూర్తయ్యాయి. గత ఏడాది కంటే చాలా ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చేలా ఈ పనులు జరగాలి. గ్రామపంచాయతీ భవనాలను నిర్మించాలి. ప్రభుత్వ స్థలం లేదా దాతలు ఇచ్చిన స్థలం ఉండి త్వరగా నిర్మించేందుకు సర్పంచ్లు సిద్ధంగా ఉన్న గ్రామపంచాయతీలకు భవనాలను మంజూరు చేయాలి. ప్రతి గ్రామంలో వైకుంట ధామాల(శ్మశానవాటిక)ను నిర్మించాలి.
 
అన్ని గ్రామపంచాయతీలకు డంపింగ్ యార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలి. గ్రామపంచాయతీ ఆమోదంతోనే ఉపాధిహామీ పనులు జరగాలి. సర్పంచ్, ఉప సర్పంచ్ చెక్పవర్ ఆదేశాలను అన్ని గ్రామపంచాయతీల్లో అమలు చేయాలి. అన్ని మండలాల్లో కంప్యూటర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో పెండింగ్లో ఉన్న ఉపాధిహామీ నిధులను విడుదల చేయాలి. కేంద్రం నుంచి రావాల్సిన ఉపాధిహామీ బిల్లులు త్వరగా విడుదలయ్యేలా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరపాలి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ నీతూప్రసాద్, ఉపాధిహామీ జాయింట్ కమిషనర్ వెస్లీ, డిప్యూటీ కమిషనర్లు సుధాకర్, రామారావు హాజరయ్యారు.