Breaking News
Home / SLIDER / సీఎం కేసీఆర్ కటౌట్లకు జలాభిషేకం

సీఎం కేసీఆర్ కటౌట్లకు జలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకే అందుతుందని అప్పట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పిన మాట క్షేత్రస్థాయిలో వాస్తవరూపం దాల్చింది. కాళేశ్వరం నుంచి మొట్టమొదటిసారిగా జిల్లాలోని కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలోని కొచ్చెరువుకు నీళ్లు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఆ జలాలతో నిండుతున్న మొట్టమొదటి చెరువు ఇదే.

దశాబ్దంన్నరగా చుక్కనీటికి నోచుకోని ఈ చెరువులోకి కాళేశ్వ రం జలాలు పరుగులు పెడుతుంటే రైతులు సంబురాలు చేసుకొన్నారు. సీఎం కేసీఆర్ నిలువెత్తు చిత్రపటాలకు జలాభిషేకంచేశారు. చెరువులోకి దుంకి ఈదులాడారు. నీళ్లల్లో నిలుచుని కేరింతలు కొట్టారు. తమచెరువుకు నీళ్లు వచ్చే లా చేసిన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు జన్మంతా రుణపడిఉంటామని ఆనందంగా చెప్పారు.

కొచ్చెరువులోకి కాళేశ్వరం జలాలరాకతో అక్కడ జాతర వాతావరణం నెలకొన్నది. గురువారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాగుల మల్యాల నుంచి కొచ్చెరువుకు.. అక్కడి నుంచి కొండాపూర్ కొడుపకుంట వరకు పాదయాత్రచేశారు. ఆయన వెంట చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున రైతులు, గ్రామస్థులు తరలివచ్చారు. కేసీఆర్ నిలువెత్తు కటౌట్లను ఊరేగింపుగా చెరువులోకి తీసుకెళ్లి జలాభిషేకం చేశారు. చెరువులోకి దుంకి ఈత కొట్టారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గంగుల కృషితోనే తమ చెరువుకు జలకళ వచ్చిందని హర్షం వ్యక్తంచేశారు.