Home / SLIDER / పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందాలి- మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు

పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందాలి- మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు

రాష్ట్రంలోని పట్ణణాలు ప్రణాలికాబద్దంగా అభివృద్ధి చెందాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటని, దీనిని నమూనా తీసుకుని ఇతర మున్సిపాలిటీలు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.  మున్సిపాలిటీల అభివృద్ధికి 42 అంశాలతో ఓ అభివృద్ధి నమూనాను తయారు చేశామన్నారు. దీనిని మున్సిపల్ కమీషనర్లు, చైర్మన్లకు అందజేస్తామని తెలిపారు. దీని ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలన్నారు.

ప్రతి ఒక్కరూ విద్యుత్‌ బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. మున్సిపాలిటీల్లో విధిగా చెత్త సేకరణ చేపట్టాలన్నారు. శానిటరీ సిబ్బందికి ప్రతీ నెల రూ.12 వేలు వేతలనం చెల్లించాలన్నారు. వాటర్ ఆడిట్‌లో భాగంగా ప్రజలకు ఎంత నీరు సరఫరా చేస్తున్నాం, ఆ నీటికి సరిపడా బిల్లులు చెల్లిస్తున్నారా లేదా అని అంచనాలు తయారు చేయాలన్నారు. మున్సిపాల్టీల్లో ఖాళీలగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలో నియామకాలు చేపడుతామని చెప్పారు.

అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నూటికి నూరు శాతం తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రిసోర్స్, పవర్, శానిటైజ్, వాటర్ ఆడిట్ నిర్వహించి గుణాత్మక మార్పుకు నాంది పలుకుదామన్నారు. మూడు జిల్లాలో జిల్లాకు రెండు చొప్పున మొబైల్ బస్ షీ టాయిలెట్లు ఏర్పాటు చేసి మహిళలకు అందుబాటులో ఉంచుతామన్నారు.

సంగారెడ్డి, సదాశివపేట వంటి మున్సిపాల్టీల్లో నల్లాల ద్వారా నీరు ఇచ్చే ప్రాజెక్టులు త్వరిత గతన పూర్తి చేసి ప్రజల దాహార్తి తీరుస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీ పాఠిల్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, గూడెం మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రామలింగారెడ్డి, వొడిదల సతీశ్‌, పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, వి. భూపాల్‌రెడ్డి, కలెక్టర్లు హనుమంతరావు, వెంకట్రామిరెడ్డి, ధర్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కమీషనర్లు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.