టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ వారంలోనే వందకోట్లు కలెక్ట్ చేసిన జై లవకుశ చిత్రం సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ సినీ విమర్శకులమీద చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చావు బతుకుల్లో ఉన్న సినిమాను దారిన పోయే దానయ్యలు చంపేస్తున్నారు అని ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ ఇలా మాట్లాడడం బాధగా ఉందన్నారు ఈ సీనియర్ డైరెక్టర్. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఉందా లేదా అన్నది మనకు అనవసరం. ఒక చిత్రం తీశాక విశ్లేషకుల గురించి ఎందుకు ఆలోచించాలని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ కానివాడు వచ్చి పేషంట్ చచ్చిపోయాడు అంటే చచ్చి పోతాడా.. పేషంట్ చావడు.. డాక్టర్ బతికించుకునేవాడిని బతికించుకుంటాడు.. ప్రతి గొట్టంగాడు చెప్పే మాట వినాల్సిన అవసరం లేదని అన్నారాయన. వాళ్ళని గురించి ఆలోచించడం, మళ్ళీ దానిపై మాట్లాడ్డం టైం వేస్ట్ అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. విమర్శకుడు అనేవాడు సద్విమర్శ చేయాలని, తన ఉద్దేశాన్ని సరిగా చెప్పాలని అన్నారు. ఒక సినిమా ఫెయిలైపోయిందని, డిపాజిట్లు (కలెక్షన్లు), ప్రింట్ ఖర్చులు కూడా రావనే హక్కు ఏ విమర్శకుడికీ లేదని క్రిటిక్స్ పై కూడా తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.
