తెలంగాణ రాష్ట్ర ఐటీ , పురుపాలకశాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ మహిళా కార్పొరేటర్లతో సమావేశమయ్యారు.ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జీహెచ్ఎంసీ మహిళా కార్పోరేటర్లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడే అనేక పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవకాశం ఉన్నదని, ఆ దిశగా ఆలోచించాలని వారిని కోరారు. ప్రభుత్వం నగరంలోని సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఈ మేరకు దీర్ఘకాలికంగా నగరాన్ని వేధిస్తున్న పలు సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రయత్నాలను ఆయన కార్పొరేటర్లకు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏవరికివారు వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి జనంలోకి వెళ్లాలని కోరారు.
ముఖ్యంగా ప్రతి ఆదివారం అపార్ట్మెంట్ దర్శన్ లేదా బస్తీ దర్శన్ పేరుతో అనే కొత్త కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించిన మంత్రి, మహిళా కార్పొరేటర్లు నుంచి ఆయా కార్యక్రమాలపైన ఫీడ్ బ్యాడ్ అడిగి తెలుసుకున్నారు. నగరంలో విద్యుత్ సరఫరా, శాంతిభద్రతలు, నీటి సరఫరాకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుందని, ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మహిళా కార్పొరేటర్లు మంత్రికి తెలియజేశారు. మొదటిసారి ఇంతమంది మహిళలు జియచ్ యంసి కౌన్సిల్లో ఉన్నారంటే, అది పూర్తిగా మంత్రి కేటీ రామారావు సహకారం వల్లనే సాధ్యం అయిందన్నారు. తమను ప్రత్యేకంగా పిలిచి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఉన్న సమస్యలపట్ల ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.
జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కార్పొరేటర్లకు ఇచ్చిన మూడు రోజుల పాటు శిక్షణ శిభిరాలను ఏర్పాటు చేసి ఇచ్చిన మార్గదర్శనం మేరకు అందరు కలిసి పనిచేయాలని మంత్రి కార్పొరేటర్లకు సూచించారు. హైదరాబాద్ నగరాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం నిత్య ప్రయత్నిస్తునే ఉంటుందని, ఈ ప్రయత్నంలో కార్పొరేటర్లు మరింత చురుగ్గా భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు( srdp, హైదరాబాద్ రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్) నాలాల విస్తరణ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి ముఖ్య కార్యక్రమాలను కార్పొరేటర్లకు మంత్రి వివరించారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే నగరాభివృద్ధి సాధ్యమన్నది తమ ఆలోచన అని, ఈ మేరకు జోనల్ కమిషనర్లు స్థాయిలోనే పనులకు అనుమతులిచ్చే ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తామని మంత్రి తెలిపారు. అద్భుతమైన నగరాభివృద్ధి ప్రణాళికలతో ముందుకుపోతున్న పలు నగరాలను అధ్యయనం చేసేందుకు వేళ్తామన్న కార్పోరేటర్ల వినతికి మంత్రి అంగీకరించారు. టియారెస్ పార్టీ నగర కార్పొరేటర్ల తో ఈ నెల 28న మరోసారి సమావేశం కానున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో నగర మేయర్ మరియు డిప్యూటీ మేయర్ లు పాల్గొన్నారు