కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఓ లాఫింగ్ క్లబ్ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రాలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కానీ ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అంటున్నారు. ఈ విషయాన్ని కనీసం చిన్న పిల్లలు సైతం నమ్మరు. కాంగ్రెస్ ఇప్పుడు లాఫింగ్ క్లబ్ అయ్యింది.’ అని మోదీ విమర్శించారు.‘డోక్లామ్ వివాదం నుంచి ఎలా బయటపడ్డామనే విషయం దేశమంతా తెలుసు. కానీ కాంగ్రెస్ మాత్రం దానిని ప్రశ్నిస్తూనే ఉంది.
ఆ కుటుంబానికి చెందిన ఒకరు సొంత దేశ సైన్యంపై నమ్మకం ఉంచరు. చైనా రాయబారిని కలుసుకొని డోక్లామ్ వివాదం గురించి ఆరాతీస్తారు.’ అని పరోక్షంగా రాహుల్ నుద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.రాష్ట్రాన్ని ఐదు భూతాలు పట్టిపీడిస్తున్నాయని మోదీ తెలిపారు. మైనింగ్, అటవీ, మాదకద్రవ్యాలు, టెండర్, బదిలీ మాఫియాలు రాష్ట్రంలో పాతుకుపోయాయన్నారు. వాటిని పెకిలించివేయాల్సిన సమయం వచ్చిందన్నారు.