ఢిల్లీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 సదస్సుకు హాజరైన మంత్రి ఈ సందర్భంగా పలు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం తరఫు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.అనంతరం వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ..
Shri. @KTRTRS, Hon'ble Minister of @MinIT_Telangana discussing the states new #foodprocessing policy during it's launch at #WorldFoodIndia pic.twitter.com/zVHn1ms6hC
— World Food India (@worldfoodindia) November 4, 2017
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, ఆర్థికంగా రైతుల మీద ఆధారపడుతుందని, ఇలాంటి దేశంలో ఆహార పరిశ్రమల వల్ల రైతులు లాభపడేలా చూడాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో రైతుల ఏడాది సగటు ఆదాయం లక్షా 28 వేలు ఉన్నదని, మరో అయిదేండ్లలో దాన్ని రెట్టింపు చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఈ అంశం కొందరికి నమ్మశక్యం కాకపోయినా తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. ఆ లక్ష్యాలను అందుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా సంసిద్ధంగా ఉందన్నారు. జలవనరుల ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆహార పరిశ్రమల ఏర్పాటు ద్వారా కూడా రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. క్షీర విప్లవం ద్వారా కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నట్లు చెప్పారు. ఈ-నామ్‌లోనూ తెలంగాణ నెంబర్ వన్ ఉందన్నారు. రాష్ట్రంలో 84 వ్యవసాయ మార్కెట్లకు ఈ-నామ్ కనెక్షన్ ఉందన్నారు. పారదర్శకమైన మార్కెటింగ్ వ్యవస్థతో దళారీలను రూపుమాపుతామని కేటీఆర్ అన్నారు.
13 ఒప్పందాలు
వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్‌లో తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలతో 13 ఒప్పందాలను కుదుర్చుకున్నది. గత రెండు రోజులుగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోకి సుమారు రూ.7200 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆహార పరిశ్రమలతో జరిగిన ఒప్పందాల పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మునుముందు మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందు వస్తాయని విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు.