ఏపీ ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక నాటకీయ పరిణామాల మధ్య సోమవారం ప్రజాసంకల్ప యాత్రని స్టార్ట్ చేశారు. ఇక తొలిరోజు ఈ జగన్ పాదయాత్రకి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే ఆయన దీక్షలు, ఓదార్పు యాత్రలతో జనాల్లో విస్తృతంగా పర్యటించారు. అయితే జగన్ పాదయాత్ర చేయడం మాత్రం ఇదే తొలిసారి.
ఏపీ ప్రజలకు పాదయాత్ర లు కొత్తకాదు. గతంలో 2002-03 మధ్య కాలంలో జగన్ తండ్రి వైఎస్ కూడా పాదయాత్ర చేశారు. దీనిద్వారా ఆయన అట్టడుగు వర్గాలను సైతం పలకరించే వెసులుబాటు లభించింది.వాస్తవంగా చెప్పాలంటే 2004 ఎన్నికలకు ముందు నాడు వైఎస్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వైఎస్ పాదయాత్ర చేసినా ఆయనకు అధికారం రాదు.. మరోసారి చంద్రబాబుదే అన్న చర్చలు కూడా నడిచాయి.
అయితే వైఎస్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఇక ఇప్పుడు జగన్ కూడా నాడు వైఎస్ ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. నేడు అంతకు మించిన ఇబ్బందుల్లో ఉన్నారు. నాడు జరిగిన ఉప ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయాలు సాధించింది. ఇక ఇప్పుడు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లోను టీడీపీ గెలిచింది.
జగన్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేస్తున్నారు. నాడు, నేడు ఈ తండ్రికొడుకుల పాదయాత్ర ఒకే సారూప్యతతో ఉంది. నాడు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో కనపడని వ్యతిరేకత ఉన్నా దానిని సరిగా ఫోకస్ చేసుకోలేకపోవడమే జగన్‌కు పెద్ద మైనస్‌గా మారింది. మరి ఈసారి అయినా జగన్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేనా.. వైయస్ బాటలో చేపట్టిన పాదయాత్రతో సక్సెస్ సాధించేనా అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.