ప్రఖ్యాత ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తయ్య మరణం తీరని లోటని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని స్వగ్రామమైన మాణిక్యపురంలో చుక్క సత్తయ్య పార్థీవదేహాన్ని సందర్శించి ఎంపీ కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా చుక్కా సత్తయ్య మృతి పట్ల కవిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చుక్కా సత్తయ్య తన జీవితం అంతా ఓగ్గు కళకే అంకితం చేశారని స్మరించుకున్నారు. ఆయన మృతి తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు. చుక్కా సత్తయ్య తన ఓగ్గు కథలతో తెలంగాణ పేరును దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కళాకారుడని కొనియాడారు.
చుక్క సత్తయ్య పేరును దేశవ్యాప్తంగా చిరస్తాయిగా నిలిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు తోడ్పటునిస్తుందని ఈ సందర్భంగా ఎంపీ కవిత తెలిపారు. మరుగున పడిన కళలను, కళాకారులను, తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య, జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన, ఆర్డీవో వెంకటరెడ్డి, జనగామ డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీలు బాపురెడ్డి, వెంకటేశ్వరబాబు, పలువురు సీఐలు చుక్క సత్తయ్యకు నివాళులు అర్పించి అంత్యక్రియల కార్యక్రమాలను పరిశీలించారు.