తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యార్థుల ఆత్మహత్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చదువులు, ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్న 194 కార్పొరేట్ కళాశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సంబంధిత కాలేజీల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి ఆయా కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.కళాశాలల్లో వసతులు, బోధన పద్ధతులు పర్యవేక్షించేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు .
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఊపిరిసలపని రీతిలో స్టడీ అవర్స్, సెలవుల్లో కూడా తరగతుల నిర్వహణ, హాస్టళ్లలో సరైన వసతులు లేకపోవడం, విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి అనే అంశాలు ఆత్మహత్యలకు దారి తీసినట్లు ఇటీవల ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో చేసిన తనిఖీల్లో వెల్లడైందని కడియం శ్రీహరి తెలిపారు. అనుమతి పొందిన కాలేజీల గురించి పత్రికల్లో ప్రకటనలు ఇస్తామని ప్రకటించారు. ముందస్తు ప్రవేశాలు నిర్వహిస్తున్న ఇంటర్, డిగ్రీతో పాటు ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్పొరేట్ కాలేజీల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మార్చి 31, 2018లోపు కాలేజీల అఫిలియేషన్ పూర్తి చేస్తామని తెలిపారు. కళాశాల అనుమతి తీసుకున్న సమయంలో హాస్టల్‌కు అనుమతి తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇంటర్ బోర్డు క్యాలెండర్, నిబంధనలు పాటించని కాలేజీల గుర్తింపు రద్దుకు ఆదేశాలు జారీ చేశామన్నారు.