Home / SLIDER / నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. అనురాగ్‌శర్మ

నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. అనురాగ్‌శర్మ

తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ అనురాగ్‌శర్మకు పోలీస్‌శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. డీజీపీగా అనురాగ్‌శర్మ పదవీకాలం నేటితో ముగిసింది. పదవి విరమణ సందర్భాన్ని పురస్కరించుకుని డీజీపీ అనురాగ్‌శర్మకు తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 11 పోలీస్ బృందాలు కవాతు, పరేడ్‌లతో అనురాగ్‌శర్మకు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్‌ను నెంబర్-1గా నిలబెట్టిన ఘనత డీజీపీ అనురాగ్‌శర్మకు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. కొత్త రాష్ట్రంలో అన్ని ఇబ్బందులను అధిగమించినట్లు చెప్పారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని తెలంగాణ పోలీసులు నిరూపించారని కొనియాడారు.

అనురాగ్‌శర్మ మాట్లాడుతూ.. తనతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికీ అనురాగ్‌శర్మ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో పాటు సీఐడీ పోలీసులు తనకెంతో సహకరించారన్నారు. 1992లో పాతబస్తీ డీసీపీగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఏర్పడ్డాక అన్ని సవాళ్లను అధిగమించేలా పోలీసింగ్‌ను మార్చామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు కావాల్సిన అన్ని సదుపాయాలను సీఎం కేసీఆర్ కల్పించారని చెప్పారు. సీఎం సహకారంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను అదుపులో పెట్టామన్నారు. అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగస్వాములమయ్యామని తెలిపారు. కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు అనురాగ్‌శర్మ పేర్కొన్నారు.