తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ నుంచి మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీకి అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు …ముందుగా డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెండో డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని కొనియాడారు మహేందర్‌రెడ్డి. సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉన్నతికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ సిటీలో నేను సైతం ప్రాజెక్టు అద్భుత ఫలితాలను ఇచ్చిందని గుర్తు చేశారు. నగరంలో సీసీ కెమెరాలను భారీగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో పోలీసు శాఖలో 18,500 పోస్టులు భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. టెక్నాలజీని ఉపయోగించి శాంతిభద్రతలను అదుపులో పెడుతామన్నారు. హోంగార్డుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
