తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. భారతదేశం మొత్తంలో పశ్చిమబెంగాల్, ఏపీకి మినహాయించి అన్ని రాష్ర్టాలు జిల్లాల పునర్విభజన చేసుకున్నాయని తెలిపారు. అదే విధంగా తెలంగాణ కూడా జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పరిపాలన సౌలభ్యం – ప్రజలు కేంద్ర బిందువుగానే జిల్లాల విభజన జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు – నూతన పాలన వ్యవస్థపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన సందేహాలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. జిల్లాల ఏర్పాటు రాష్ర్టాలకు మాత్రమే సంబంధం.. కేంద్రానికి హక్కు లేదన్నారు. కేంద్రం నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆర్బీఐ, ఎన్‌సీ 31 జిల్లాలను నోటిఫై చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం సహా అన్ని కేంద్రమంత్రుల కార్యాలయాలు 31 జిల్లాలను నోటిఫై చేశాయన్నారు. జిల్లాల విభజన రాష్ర్టానికి సంబంధించినదని స్పష్టం చేశారు.
