Home / SLIDER / ఫలించిన సీఎం కేసీఆర్ కృషి..!

ఫలించిన సీఎం కేసీఆర్ కృషి..!

తెలంగాణ జీవప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. తెలంగాణ ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చివేయగల ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ తుది దశ అనుమతి ఇచ్చింది. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంతో మొదలయిన కాళేశ్వరం అనుమతుల ప్రస్థానం ఇప్పుడు చరమాంకానికి చేరింది. ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కోర్టుల్లో వేసిన, వేయించిన 197 కేసులు, ప్రజాభిప్రాయ సేకరణలో చేసిన అల్లర్లు.. ఉద్యమాలు, ధర్నాల పేరుతో సాగించిన రచ్చ.. ఏవీ కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేకపోయాయి. రెండున్నర కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేయగల గోదావరి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తిచేసే లక్ష్యంతో ఆగమేఘాలపై పనులు నడిపిస్తున్నది.
CMKCR
ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గోదావరిజలాల గరిష్ఠ వినియోగంతో బీడు భూములను పచ్చని పంటపొలాలుగా మార్చడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇక శరవేగంతో నిర్మాణంకానుంది. ఇతర ప్రాజెక్టులకు జీవం పోయడంతోపాటు, పునర్జీవం కల్పించే కొత్త చరిత్రను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లిఖించబోతున్నది. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న గోదావరిని దక్షిణ తెలంగాణకు మళ్లించి, పల్లేర్లు మొలిచిన నేలలో బంగారం పండించనున్నది. ఇందుకు వీలు కల్పిస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కాళేశ్వరం ప్రాజెక్టుకు తుది దశ అనుమతులనిస్తూ శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. అటవీ సంరక్షణ చట్టం సెక్షన్ 2 కింద ఈ అనుమతులనిచ్చింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రులతో, జల వనరుల శాఖ ఉన్నతస్థాయి అధికారులతో రెండు రోజులపాటు జరిపిన మంత్రాంగం సత్ఫలితాలనిచ్చింది.

మొదటి దశ అనుమతులు లభించిన నెలలోపే రెండో దశ అటవీ అనుమతులను సాధించడంద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రికార్డు సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మహాదేవ్‌పూర్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్సువాడ, నిర్మల్ అటవీ డివిజన్ల పరిధిలో దాదాపు 3168.13 హెక్టార్లలో వివిధ రకాల పనులను చేపట్టడానికి గత నెల 24న కేంద్ర, అటవీ పర్యావరణ శాఖ మొదటి దశ అనుమతినిచ్చింది. అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకానికి అంతేస్థాయిలో భూమిని కేటాయించాలని, బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నగదు జమచేయాలని, కేటాయించిన భూమిలో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలని షరతులు విధించింది. ఈ షరతులను, నిబంధనలను కేవలం వారంలోనే రాష్ట్ర ప్రభుత్వం పరిపూర్తిచేసింది. ఫలితంగా నెల తిరిగే సరికి తుది అనుమతులు లభించాయి. రెండోదశ అనుమతులతో ఈ భూములలో కాల్వల నిర్మాణం, సొరంగ మార్గాల ఏర్పాటు, సర్జ్‌పూల్, లిఫ్టులు, రిజర్వాయర్ల నిర్మాణంవంటి పనులను ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా పూర్తి స్థాయిలో చేపట్టడానికి వీలు కలిగింది.
Ts

అటవీశాఖ సూచనలు, నిబంధనలు..

తుదిదశ అనుమతులు ఇస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించింది. ప్రాజెక్ట్ పనులకోసం బదలాయించిన అటవీ భూముల సహజ రూపాన్ని మార్చరాదని పేర్కొంది. అటవీ భూములకు బదులుగా కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ కింద అటవీశాఖకు మ్యూటేషన్‌చేసిన 3367.1389 హెక్టార్ల రెవెన్యూ భూములను అటవీ చట్టం సెక్షన్ 4 కింద రిజర్వ్ ఫారెస్ట్‌గా లేదా సెక్షన్ 29 కింద ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ (రక్షిత అరణ్యం)గా ప్రకటించాలని షరతు విధించింది. ప్రత్యామ్నాయంగా కేటాయించిన రెవెన్యూ భూములలో మొత్తం 50.69లక్షల మొక్కలను నాటాలని సూచించింది. అవికూడా రెండేండ్ల వయసు, రెండు మీటర్ల పొడవున్న మొక్కలను నాటాలని పేర్కొంది. వన్యప్రాణుల మనుగడకు ముప్పులేకుండా ప్రాజెక్ట్ పనులను చేపట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించింది.

18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు

రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని (పాత ఏడు జిల్లాలు) 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం చేయనుంది. మొత్తం 225 టీఎంసీల నీటి వినియోగానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం 142 టీఎంసీల సామర్థ్యంతో 19 రిజర్వాయర్లు నిర్మిస్తారు. 4627.24 మెగావాట్ల విద్యుత్‌తో ఇరిగేషన్ లిఫ్టులు ఏర్పాటుచేస్తారు. 19 పంప్‌హౌజ్‌లకు 13558 మిలియన్ యూనిట్ల కరెంట్ వినియోగమవుతుందని అంచనా. కాళేశ్వరం ప్రాజెక్టునుంచి హైదరాబాద్‌కు 30 టీఎంసీలు, పారిశ్రామికావసరాలకు 16 టీఎంసీలు కేటాయించారు. ఏటా ఈ ప్రాజెక్టుద్వారా వివిధ రంగాల్లో రూ.22వేల కోట్ల మేరకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ముఖ్యంగా ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల (ఫాం ప్రొడక్ట్స్) కింద ఇప్పుడు ఏటా రూ.758.14 కోట్ల ప్రయోజనం ఉండగా.. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అది ఏకంగా రూ.17,220.87 కోట్లకు పెరుగనుంది.
CMKCRlist

ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలు

సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఏకంగా 197వరకు కేసులు వేయగా.. అందులో కాళేశ్వరంపైనే 65 ఉన్నాయి. రాజకీయాలకోసం తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టేందుకుసైతం ఆ పార్టీ నాయకులు వెనుకంజ వేయడంలేదని దీనిని బట్టి అర్థమవుతుంది. కోర్టుల, ట్రిబ్యునళ్లు.. చివరకు ప్రజాక్షేత్రంలోనూ రైతుల మద్దతు వారికి లభించలేదు. ఈ ప్రాజెక్టుపై కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను భగ్నంచేసేందుకు యత్నించి దారుణంగా విఫలమయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు ఆ పార్టీ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి కేంద్ర పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్లారు. అక్కడా చుక్కెదురవడంతో పెద్దపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణను భగ్నంచేసేందుకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పథకం పన్నారు. అది కూడా వికటించింది. గత ఆగస్టు 22 నుంచి 26 వరకు నాలుగురోజులపాటు ఏకంగా 15 జిల్లాల్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో వేలమంది స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతు పలికారు.

కాళేశ్వరంపై పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు..

CMKCR1
అసెంబ్లీలో ప్రజంటేషన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నీళ్లియ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా.. వంద శాతం మా ప్రస్థానం కొనసాగుతుంది. అల్టిమేట్‌గా.. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో చెప్పినట్లు, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్లు కోటి ఎకరాలకు నీళ్లు రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తెచ్చి తీరుతం. నా తెలంగాణ కోటి ఎకరాల వీణ కావాలి. ప్రాణం పోయినా సరే.. రాజీ పడకుండా నీళ్లు తెస్తం.

మంచికో.. చెడుకో.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును వైఎస్ మొదలుపెట్టినరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చూస్తే రూ.8వేల కోట్లు ఖర్చు చేసి సొరంగాలు, కాల్వలు తవ్వి పెట్టినరు. ఆ ఖర్చు పెట్టిన పైసలు వృథా కావొద్దని కొత్త ప్రతిపాదన చేసినం. దూరదృష్టితో వాటర్ సోర్స్‌ను తమ్మిడిహట్టి నుంచి బ్రహ్మాండంగా నీటి లభ్యత ఉన్న మేడిగడ్డకు మార్చినం. ఎస్సారెస్పీ తర్వాత గోదావరిలో మంచి నీటి లభ్యత ఉన్నదంటే అది ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తర్వాతనే. సుమారు 3200 టీఎంసీల నీటి లభ్యత. దేవాదుల నీటి లభ్యత కోసం కూడా బరాజ్ కడుతున్నం. అవన్నీ చూసి సైట్ నిర్ణయిస్తే దానిపై పీటముడి. సమస్యల్ని అధిగమించేందుకు జీవో 123ను తెస్తే దానిపై కోర్టులో సవాలు చేస్తరు. ప్రజల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తరు. జీవో 123 అయినా, ఈ బిల్లయినా కేవలం ప్రాజెక్టులు తొందరగ పూర్తయి, రైతులకు నీళ్లందించాలనే ఉద్దేశంతోనే తీసుకువస్తున్నం.

కృష్ణానది తమ సొంతమైనట్టు నాటి సమైక్య పాలకులు వ్యవహరించారు. పులిచింతల ప్రాజెక్టును సాయుధ పోలీసుల పహరాలో అప్పటి సీఎం వైఎస్ నిర్మించారు. అక్కడి నుంచి గోదావరి జలాల వైపుకు వైఎస్ మళ్లిండు. అర్జెంటుగా పోలవరం కట్టాలని చూసిండు. తెలంగాణ వాళ్లు అమాయకులు, చెప్పింది నమ్ముతరని ఆయన ధైర్యం. పోలవరానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుకావడంతో ప్రాణహిత- చేవేళ్లను తెరపైకి తెచ్చాడు. మహారాష్ట్రతో ఒప్పందం లేకుండానే తెలంగాణలోని 16 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని ప్రకటించారు. 16 టీఎంసీల నీటితో 16 లక్షల ఎకరాల సాగు సాధ్యమా? ప్రపంచంలో ఎక్కడైన ఈ రకమైన ప్రతిపాదనతో ప్రాజెక్టు ఉంటదా?

మహారాష్ట్ర ఒప్పంద సమయంలో ముంబైలో

తెలంగాణ, మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం కుదురడం రెండు రాష్ర్టాల చరిత్రలో ఓ మహత్తర అధ్యాయం. సుదీర్ఘకాలం పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ప్రజలకు అనేక ఆకాంక్షలున్నయి. నీళ్లు, నిధులు, ఉద్యోగాలకోసం పోరాటంచేసినం. సరిహద్దు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో ఘర్షణాత్మక వైఖరితో ఉండాలనుకోవడం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టు ముఖచిత్రం

ప్రాజెక్టు అంచనావ్యయం : రూ.80,499.71 కోట్లు
లిఫ్టులు : 20
పంపుహౌజ్‌లు : 19
అవసరమయ్యే విద్యుత్ : 4627.24 మెగావాట్లు
-13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
-18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
-225 టీఎంసీల నీటి వినియోగానికి ప్రణాళిక
-142 టీఎంసీల సామర్థ్యంతో 19 రిజర్వాయర్లు
-4627.24 మెగావాట్ల విద్యుత్‌తో లిఫ్టులు
-ప్రాజెక్టునుంచి హైదరాబాద్‌కు 30 టీఎంసీలు
-పారిశ్రామికావసరాలకు 16 టీఎంసీలు
-వివిధ రంగాల్లో రూ.22వేల కోట్ల మేర ప్రయోజనం
-రూ.17,220 కోట్లకు పెరుగనున్న వ్యవసాయ ఉత్పత్తులు

Harish-Rao

అడ్డంకులు సృష్టిస్తున్నవారికి చెంపపెట్టు!

కాళేశ్వరం ప్రాజెక్టును కోర్టు కేసులతో అడ్డుకోవాలనుకున్న వ్యక్తులు, శక్తులకు అటవీశాఖ తుదిదశ అనుమతులు చెంపపెట్టు. ఇటీవల జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సహకారంతో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కలిసిన ఫలితంగా కేంద్రం ఈ ఉత్తర్వులు జారీచేసింది. 15 రోజుల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్సు, అంతర్రాష్ట్ర అనుమతి, కేంద్ర భూగర్భజలశాఖ, కన్‌స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ నుంచి అనుమతులు రావడం మనకు గర్వకారణం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రావాల్సిన అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నించాం. అందులో విజయం సాధించాం.
– నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

సోర్స్ : నమస్తే తెలంగాణ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat