భారత్, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న రామసేతు (వారధి) మానవ నిర్మితమేనని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. శ్రీరాముడు లంక వరకు ఈ వారధిని నిర్మించినట్టు రామాయణంలో ప్రస్తావన ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై చాలా ఏండ్లుగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాముడే నిర్మింపజేశాడని కొందరు, సహజసిద్ధంగా ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా డిస్కవరీ సైన్స్ చానల్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపి రామసేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని, మానవులే నిర్మించారని నిర్ధారించింది. పరిశోధనకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం బుధవారం రాత్రి 7.30 గంటలకు అమెరికాలో ప్రసారం కానుంది.
ఈ కార్యక్రమ ప్రోమోలో ఓ భూగర్భ శాస్త్రవేత్త ‘రామసేతులో ఉన్న రాళ్లను వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి అక్కడి ఇసుక దిబ్బలపై అమర్చారు’ అని తెలిపారు. అమెరికాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్త చెల్సియా రోజ్ మాట్లాడుతూ.. రామసేతులో ఇసుకపై రాళ్లు ఉన్నట్టు కనిపిస్తున్నా, రాళ్లను అమర్చిన తర్వాతే ఇసుక వచ్చి చేరిందని చెప్పారు. కార్బన్ డేటింగ్ ప్రకారం రామసేతులోని రాళ్లను ఏడువేల ఏండ్ల కిందట అమర్చగా, దాని కింద ఉన్న ఇసుక వయసు కేవలం నాలుగు వేల ఏండ్లు మాత్రమేనని వెల్లడించారు. ఈ ప్రోమో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఒక్క రోజులోనే దాదాపు రెండు లక్షల మంది వీడియోను చూడగా, 14వేల రీట్వీట్లు వచ్చాయి.
రామసేతు మానవ నిర్మితమని ప్రకటించడంతో పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వారధి మానవ నిర్మితమని భారతీయులందరికీ తెలుసని, అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి నిర్ధారిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన కమిటీ సైతం ఇది మానవ నిర్మితమని చెప్పిందన్నారు. రామసేతు భారత చారిత్రాత్మక సంపదలో ముఖ్యమైన భాగమని, దాని ఉనికిని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. శ్రీరాముడికి ప్రతిరూపంగా భావిస్తున్న రామసేతును ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. బీజేపీ మొదటి నుంచి దీనికి కట్టుబడి ఉన్నదని, కాంగ్రెస్ ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో రామసేతును తొలిగించి సముద్రాన్ని తవ్వేందుకు ‘సేతుసముద్రం షిప్పింగ్ చానల్ ప్రాజెక్ట్’కు అనుమతి ఇచ్చింది. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ సహా పలు సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలో, కొనసాగించాలో స్పష్టం చేయాలని ఈ ఏడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.