ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో డిసెంబర్ 15 నుండి 19వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే .. కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ మహాసభల లక్ష్యం. ఈ మహాసభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, సీఎం కేసీఆర్… ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మహాసభల కోసం 41 దేశాల నుంచి 450 మంది అతిథులు, ప్రతినిధులు తరలివచ్చారు .తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి . ముగింపు సభలో తెలంగాణ విశిష్టతను తెలిపే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.అయితే ఇదివరకు కూడా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు సార్లు హైదరాబాద్, మలేసియా, బళ్ళారి, తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించింది.కానీ గతంలో నిర్వహించిన తెలుగు మహాసభల్లో కంటే తొలి సారిగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా రెండు రోజులపాటు డిసెంబరు మాసంలో తెలంగాణ తెలుగు మహాసభలు వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.