ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భానుప్రసాద్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పదేళ్లు అధికారంలో ఉండగా రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఇపుడు వారి గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండగా స్వామినాథన్ కమిటీ సిఫారసులను పెడచెవిన బెట్టిన కాంగ్రెస్ నేతలు ఇపుడు వాటి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
`అధికారం లో ఉండగా రైతుల బతుకులను చిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ నేతలే. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో జలయజ్ఞం కింద ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు అధికారం లోకి వచ్చినా వాటిని పెండింగ్ లోనే పెట్టారు. పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్న మధుయాష్కీ తాను ఎంపీగా ఉండగా సొంత ప్రభుత్వాన్ని ఒప్పించి ఎందుకు సాధించలేకపోయారు? అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీ కవిత కృషి వల్లే పసుపు బోర్డు ఏర్పాటు పై కదలిక వచ్చిందని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని అన్నారు. `రైతులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్‌దైతే వారిని అడుగడుగునా వంచింది కాంగ్రెస్ పార్టీ. గుజరాత్ లో కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు మోస పూరిత వాగ్ధానాలు ఎన్ని చేసినా వారు విశ్వసించలేదు. తెలంగాణ లో కూడా కాంగ్రెస్ కల్లి బొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు` అని ప్రకటించారు.
`ఆర్మూరు డిక్లరేషన్ రైతుల సంక్షేమం కోసం చేసింది కాదు ..కాంగ్రెస్ నేతలు తమ పదవుల యావతో చేసుకున్న డిక్లరేషన్ అది. స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తారు. సిఫారసులు చేసిన స్వామినాథన్ యే స్వయంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ను ప్రశంసిస్తూ సీఎం కెసిఆర్ కు లేఖ రాశారు. కాంగ్రెస్ నేతలకు స్వామినాథన్ లాంటి మేధావుల ప్రశంసలు కనబడడం లేదా? రైతులకు మేనిఫెస్టో లో ఇవ్వని హామీలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎకరాకు ఎనిమిది వేల పెట్టుబడి పై మేనిఫెస్టో లో హామీ ఇవ్వకున్నా అమలు చేయబోతున్నాం. కాంగ్రెస్ నేతలు ఎడారిలో ఉన్న బాటసారులు. ఎటు వెళ్లాలో వారికి అర్ధం కావడం లేదు. కాంగ్రెస్ తీరు ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రతి పక్ష హోదా కూడా దక్కదు` అని స్పష్టం చేశారు.