తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహ్ములు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు.
నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీలో చేరాం..నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు అందరూ టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగానే ప్రతిపక్ష బీజేపీకి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా పథకాలను కేంద్రం ప్రశంసిస్తుంటే…రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలంగాణ విద్యా పథకాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేబ్ సమావేశంలో చెప్పారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కొత్త సంస్థలు ఇస్తూ…తెలంగాణకు ఇవ్వకపోవడం పక్షపాతం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ఇస్తూ తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రానికి కొత్త సంస్థలు కేంద్రం ఇవ్వడం లేదంటే బీజేపీ లక్ష్మణ్ బాధపడ్డారని…కొత్త సంస్థలు తీసుకురావడంలో బీజేపీ నేతలు తమ పలుకుబడి ఉపయోగించాలని హితవు పలికారు.