ఇండియా టుడే కాంక్లేవ్ లో సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. దేశం అబ్బురపడేలా సీఎం కేసీఆర్ మాట్లాడారని కర్నె ప్రభాకర్ కొనియాడారు. దీంతో, సీఎం కేసీఆర్ ప్రతిష్ట మరింత పెరిగిందన్న దుగ్ధతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆనందంతో ఉప్పొంగడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని కర్నె వ్యాఖ్యానించారు.
దేశం అంతటికి తెలంగాణ ఆదర్శం కావడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదని ఎమ్మెల్సీ కర్నె అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు లక్షన్నర కోట్ల బడ్జెట్ పెట్టేసరికి కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్యాకై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లో సీఎం కేసీఆర్ మాట్లాడిన విషయాలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పు పట్టారు. ఈ ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్ చెప్పినట్లు మిషన్ కాకతీయతో 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది నిజం కాదా? కోటి ఎకరాలకు నీరందించే సాగునీటి ప్రాజెక్టులు వేగంగా నిర్మాణం అవుతున్నది నిజం కాదా? అన్ని రకాల ఉద్యోగస్తుల జీతాలు పెద్ద మొత్తంలో పెంచింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రమైనా ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే అప్పులు తెస్తుందని కాంగ్రెస్ నేతలకు తెలియదా? అని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. రాష్ట్రం తెచ్చే అప్పులన్నీ పెట్టుబడులేనని స్పష్టం చేశారు.
బీజేపీ పాలనలోని గుజరాత్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో ఆయా రాష్ట్రాల బడ్జెట్ కన్నా అప్పులే ఎక్కువని కర్నె ప్రభాకర్ గుర్తుచేశారు. తెలంగాణ జీడీపీతో పోలిస్తే అప్పులు చాలా తక్కువన్నారు. శ్రీలంక జీడీపీ కన్నా తెలంగాణ జీడీపీ ఎక్కువన్నారు. హర్యానా, కేరళ చిన్న రాష్ట్రాలైనా భారీగా అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాయని వివరించారు. అభివృద్ధికి అప్పులు కూడా అవసరమేనని ఏ ఆర్థికవేత్తని అడిగినా చెబుతారని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం కనీస పరిజ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి చంద్రబాబుకు, టీడీపీకి కోవర్ట్ అని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తానని ప్రకటించిన చంద్రబాబు, దాని కోసమే రేవంత్ ను కాంగ్రెస్ లోకి పంపారని చెప్పారు. కాంగ్రెస్ హై కమాండ్ ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే మంచిదని సూచించారు. ఘన చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, దానివల్ల కాంగ్రెస్ కే నష్టమని హెచ్చరించారు.