కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నానని, అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటానని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి ప్రకటించారు. అధిష్టానంతో టచ్ లో ఉన్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొంటూ పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను అని రాహుల్‌తో చెప్పానని విజయశాంతి వివరించారు. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని వివరించారు. నా తక్షణ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమని అని ప్రకటించారు.
20 ఏళ్ల నుండి తెలంగాణ కోసం పోరాడుతున్నానని..ఇక ముందూ పోరాడుతానని విజయశాంతి తెలిపారు. అవసరం కోసం పవన్ కొత్త రాజకీయాలు చేస్తుండొచ్చనని విజయశాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళని…పవన్ మాటలకు ఏమీ పడరని ఆమె వ్యాఖ్యానించారు. `అన్నను చూశాం. అన్నకు దిక్కులేదు,ఇప్పుడు తమ్ముడి పవన్ ని చూస్తున్నాం. రెండుపడవల ప్రయాణం పనికిరాదు,ఒకవైపు దృష్టి పెడితే బాగుంటుంది.` అని అన్నారు.
`జయలలిత అంటే అభిమానం,అందుకే ఏఐఏడీఎంకేకి సపోర్ట్ చేశాను. అయితే డీఎంకే పార్టీ నన్ను చంపాలని చూసింది.` అని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో తన ప్రస్థానం గురించి విజయశాంతి వివరించారు. `మేమందరం అద్వానీ శిష్యులం. అద్వాణీకి బీజేపీలో అన్యాయం జరిగింది. కనీసం అధ్యక్షుడిగా అయినా ఎన్నుకోవాల్సింది` అని వాపోయారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో యువతకు అవకాశాలు ఈ సారీ ఎక్కువగా ఉంటాయని ఆశిస్తున్నానని విజయశాంతి తెలిపారు. రాహుల్ గాంధీ ఎలాంటి బాధ్యతలు అప్పగించిన చేయడానికి సిద్ధమన్నారు.