వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం సగుటూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను నిలబెట్టడంతోపాటు పౌరహక్కులను పరిరక్షిండంలో సామాజిక న్యాయాన్ని అందించడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని, ఒక రక్షణ కవచంగా నిలిచిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
