తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ తన మార్కు రాజకీయం ఏంటో చూపించింది. కలిసి సాగుదామని ప్రతిపాదించిన కాంగ్రెస్..అలాటి ఆలోచనలోనే ఉంచుతూ ఏకంగా వెన్నుపోటు పొడిచిందని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దెదించుదాం…మనం ఏకమవుదాం…అంటూ ప్రకటించిన తెలంగాణ జేఏసీకి దిమ్మతిరిగే షాకిచ్చింది.గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో టీజేఏసీ నాయకుడు భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేటకు చెందిన భూపతిరెడ్డితో ఆయన సన్నిహితులు కాంగ్రెస్ కండువా కప్పుకున్న పరిణామంతో ఈ చర్చ జరుగుతోంది.
తమ ఉమ్మడి ప్రత్యర్థిగా సీఎం కేసీఆర్‌ను భావించి కలిసికట్టుగా పోరాటం చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్…తెలంగాణ జేఏసీ నేతలను తమ గూటికి చేర్చుకోవడం కలకలంగా మారింది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎదుర్కునేందుకు ఆయన ప్రత్యర్థులంతా ఏకం కావాలని ఇందులోకి జేఏసీ కూడా చేరాలని కాంగ్రెస్ నేతలు పదే పదే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సైతం తాము ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో కలిసి సాగుతామని ప్రకటించారు. అలాగే కొన్ని నిరసన కార్యక్రమాలు సైతం జరిగాయి. అయితే.. ఆ తర్వాత ఇరువర్గాలకు గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే..కాంగ్రెస్ పార్టీ తన బలం పెంచుకునేందుకు జేఏసీ నేతలకు గాలం వేస్తోందని చెప్తున్నారు.
కాగా,ఈ పరిణామం జేఏసీ వర్గాలను షాక్‌కు గురిచేసిందని ప్రచారం జరుగుతోంది. తమను ఆదిలోనే ఘోరంగా దెబ్బతీసే ఎత్తుగడను కాంగ్రెస్ అవలంభించిందని జేఏసీ నేతలు వాపోతున్నట్లు సమాచారం.