వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇక పాదయాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన హామీలను.. వాగ్దాన భంగాలను ప్రజలకు గుర్తు చేస్తూ అధికార పక్షం పై విమర్శల దాడిని ఉదృతం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళుతూ గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతి ఇంటికి ఒక లేఖ పంపారని అందులో ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగం కల్పిస్తాం రెండు ఇవ్వలేకపోతే ఇంటికి రెండువేలరూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ వాగ్దానం లిఖిత పూర్వకంగా ఇచ్చిన అంశం ప్రస్తావించారు జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 45 నెలలు అయిందని ఆయన చెప్పిన లెక్క ప్రకారం 90 వేలరూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడ్డారని లెక్క కట్టారు జగన్.
అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా అమలు చేయలేదో చెబుతూ ఒక వేళ ఎన్నికల ముందు మళ్ళీ ఓట్ల కోసం నిరుద్యోగ భృతి ఇస్తే పాత బకాయి మాటేమిటన్న ప్రశ్న జనం మదిలో నాటుతున్నారు జగన్. దాంతో ఇప్పడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇచ్చి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్న బాబు సర్కార్ ఉలిక్కి పడుతోంది. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అంటూ 90 వేలరూపాయల కోసం ప్రజలు డిమాండ్ చేస్తే ఈ పధకం ఇప్పుడు అమలు చేసినా పెద్దగా తమకు ప్రయోజనం ఉండదని లబ్ది దారులైన వారందరికీ 90 వేలు బాకీ చెల్లించండనే నినాదంతో వస్తే ఇబ్బందే అని.. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతారన్నది వైసీపీ ఆలోచన. నిరుద్యోగ భృతి అంశం బాగా వినియోగించుకోవడానికి వైసీపీ శ్రేణులు సిద్ధం చేసిందని సమాచారం. మరి జగన్ అండ్ కో వేసిన ఈ ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే అని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.