తనకు తాను ఫైర్‌బ్రాండ్ నేతగా ప్రచారం చేసుకుంటూ సీఎం కుర్చికి కొంచెం దూరంలో మాత్రమే ఉన్నట్లుగా భావించే ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చుక్కలు కనిపించడం మొదలైందని అంటున్నారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదులుకుని కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌కు ఆ పార్టీ మార్క్ షాక్‌లు తగులుతున్నాయని అంటున్నారు. దీంతో ఆయన నడిచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు ఇప్పుడు రేవంత్‌పై గుర్రుమంటున్నారని సమాచారం.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ…ఆ పార్టీ తెలంగాణలో గల్లంతు అయిపోయిన నేపథ్యంలో రేవంత్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరిక సమయంలో కాంగ్రెస్‌లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ లభిస్తుందని, పార్టీ హామీ లభించిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన సన్నిహిత వర్గాలు ప్రచారం చేశాయి.రేవంత్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేం నరేందర్ రెడ్డి, బోడ జనార్ధన్ సహా పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఆ పార్టీలో వారికి తీవ్ర అవమానం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏఐసీసీ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ కొనసాగుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కింది స్థాయిలో అవసరమైన మార్పులు చేసుకోవడానికి, ఖాళీలు ఉంటే భర్తీ చేసుకునేందుకు అధ్యక్షులకు అవకాశం కల్పించారు. అయినప్పటికీ…ఉత్తమ్‌కుమార్ రెడ్డి రేవంత్ వర్గానికి పదవులు ఏవీ ఇవ్వలేదు.రేవంత్ రెడ్డి తనతో పాటు తన వెంట వచ్చిన ముఖ్యులకు సముచిత స్థానం కల్పించాలన్న డిమాండ్ పార్టీ ముందు పెట్టినప్పటికీ అది ఫలితం ఇవ్వలేదు. రేవంత్ వెంట నడిచినందుకు తమకు దక్కింది ఏమిటని టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలు ఆయనపై ఫైరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ అయిన టీడీపీలో ఉన్న తమ పార్టీ నేతలుగా గుర్తించే వారని, రేవంత్ వల్ల రెంటికి చెడ్డ రేవడి అయిపోయామని ఆ నేతలు వాపోతున్నట్లు అంటున్నారు.