ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మాణిగాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ చేస్తున్నఅభివృద్ధి పనులకి తాము ఎంతగానో ఆకర్షితులయ్యామని అందుకే పార్టీ మారుతున్నామని.. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. అయితే గతంలో టీడీపీ ఇచ్చిన ప్యాకేజ్‌లకి లొంగే నీతిలేని వారంతా పార్టీ మారారంటూ గతంలో వైసీపీ ఆరోపణలు గుప్పించింది. అయితే తాజాగా ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ.. తాను టీడీపీకి అమ్ముడుపోయానని ఆత్మసాక్షిగా చెబుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక పార్టీ మారిన విషయంలో తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని.. ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి.. టీడీపీలో చేరుతున్నామని చాలామంది చెబుతున్నారని.. అయితే నేను మాత్రం అలా చెప్పలేనని మణిగాంధీ అన్నారు. ఇక ఆరు నెలలు ఓపికపడితే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని తెలిపారు. బద్వేలు ఎమ్మెల్యే జయరాముడు త్వరలో టీడీపీ నుంచి బయటకు రానున్నట్టు ఆయన చెప్పడం విశేషం. తాను రాజకీయాల నుంచైనా తప్పుకుంటాను గానీ.. విష్ణువర్ధన్‌రెడ్డితో రాజీ పడే సమస్యే లేదని తేల్చి చెప్పారు. అంతే కాకుండా తమ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ఇన్‌చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు.. సభ్యత్వ కార్డులను దొంగిలించారని తీవ్ర ఆరోపనలు గుప్పించారు సభ్యత్వాల కోసం 13.50 లక్షలు చెల్లిస్తే ఇప్పటికీ తనకు, తన కార్యకర్తలకు ఇవ్వలేదన్నారు.