తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేసీఆర్‌కు మరో మారు అంతర్జాతీయ వేదికల నుంచి ప్రశంస దక్కింది. ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు చెందిన చట్టసభల ప్రతినిధుల బృందం మంత్రి కేటీఆర్ పనితీరుపై కితాబు ఇచ్చారు. భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా చట్టసభల బృందం సభ్యులు టెర్రీ సీవెల్, డీనా టీటస్,తెలంగాణలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని టీహబ్‌లో వీహబ్‌కు సంబంధించిన ప్రత్యేక చర్చాగోష్టిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీహబ్ సీఈఓ దీప్తిరావుల వీహబ్ లక్ష్యాలను వివరించారు.
ప్రభుత్వం మహిళల స్వావలంభన,సృజానాత్మకుక ఇస్తున్న ప్రోత్సాహంపై అమెరికాకు చెందిన చట్టసభల ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపించింది. మహిళల్లోని ఆలోచనలకు ఆచరణ రూపం ఇచ్చేందుకు వీహబ్ ప్రశంసనీయ చర్య అని కితాబిచ్చింది. మహిళా ఆవిష్కర్తలకు ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వీహబ్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ సందర్బంగా వీహబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారని, మూడునెలల స్వల్పకాలంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకున్నామని వీహబ్ సీఈఓ వెల్లడించగా అమెరికా బృందం ప్రశంసలు గుప్పించింది.
అమెరికా చట్టసభల సభ్యులు డీనా టీటస్,టెర్రీ స్వీవెల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీహబ్ ఏర్పాటు చేయడం వినూత్న, పురోగామి నిర్ణయమని అన్నారు. డీనా టీటస్ మాట్లాడుతూ భారతదేశానికి మొదటి సందర్శనలోనే మహిళలకు సంబంధించి ముఖ్యమైన అడుగు వేసిన రాష్ట్రంలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘మహిళలు గెలిస్తే అమెరికా గెలిచినట్లే’ అనేది తమ డెమోక్రటిక్ పార్టీ స్లోగన్, తెలంగాణ ప్రభుత్వ అడుగులు అదే రీతిలో ఉన్నాయని కితాబు ఇచ్చారు. టెర్రీ స్వీవెల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఇస్తున్న ప్రోత్సాహం ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాక్షించారు. మంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకొని మహిళలకు ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటుగా గ్రామీణ ఆవిష్కర్తలకు ప్రోత్సాహం అందించడం సంతోషకరమన్నారు. టీహబ్, వీహబ్ అభివృద్ధి పథంలో సాగాలని ఆమె ఆకాంక్షించారు.