ఒక్క వాట్సాప్ మెసేజ్ అతని ప్రాణాన్ని కాపాడింది.. ట్విట్టర్ వేదికగా సాయం చేయడంలో ముందుండే టీఆర్ఎస్ పార్టీ యువనేత,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఓ కండక్టర్ శస్త్రచికిత్స కోసం సహాయమందించి మంత్రి కేటీఆర్ ఆపద్బాంధవుడయ్యారు. వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ విజయవంతమయ్యేలా చూశారు.
రాజన్న సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ బెరుగు రమేశ్ శనివారం హైబీపీతో నరాలు తెగి కోమాలో వెళ్లాడు. ఆయనను హైదరాబాద్ మాక్స్ క్యూర్ దవాఖానలో చేర్పించగా, ఆపరేషన్‌కు రూ.16లక్షల దాకా అవుతుందని పేర్కొనడంతో రమేశ్ కుటుంబీకులు భయాందోళనకు లోనయ్యారు. ఆర్టీసీ సంస్థను సంప్రదించినా ఫలితం లేకపోయింది. తెల్లావారిదే ఆదివారం అంతడబ్బుకు అప్రూవ్ కాదని చెప్పేశారు. ఇటు ఆపరేషన్ చేయకుంటే ప్రాణాలు నిలువని అయోమయంలో పడ్డారు. రమేశ్ బావమరిది, టీఆర్‌ఎస్ నాయకుడు మీసరగండ్ల అనిల్ ఈ విషయాన్ని జిల్లెల్ల సర్పంచ్ మాట్ల మధు సహాయంతో మంత్రి కేటీఆర్‌కు వాట్సప్ ద్వారా వివరించారు.
వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ సంబంధిత హాస్పిటల్ వైద్యులతో మాట్లాడారు. ఆపరేషన్ చేయాలని, ఖర్చు సంగతి ఆలోచించవద్దని, అవసరమైతే తాను ఆ ఖర్చు చెల్లిస్తానని చెప్పడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. తర్వాత మంత్రికేటీఆర్ తన పీఏ తిరుపతి, పీఎస్ శ్రీనివాస్‌ను అప్రమత్తంచేసి, ఆపరేషన్ పూర్త య్యే దాకా సమీక్షించాలని ఆదేశించారు. ఆపదలో స్పందించి, ప్రాణాలు నిలబెట్టిన మంత్రి కేటీఆర్‌కు రమేశ్ భార్య అరుణ, పిల్లలు స్వాత్విక్, ప్రగతి, బావ మరిది అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.