అన్నదాతల సంక్షేమం కోసం అహారహం శ్రమిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖకు విశేష గుర్తింపు దక్కింది. వ్యవసాయ రంగం అభివృద్ది, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు, తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రాధాన్యత దక్కింది. “వ్యవసాయ రంగంలో అత్యధిక వేగంగా అభివృద్ది” చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రతిష్టాత్మిక “ఇండియా టుడే” సంస్థ గుర్తించి అవార్డును ప్రకటించింది. ఈ నెల 23 న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ అవార్డును బహుకరించనున్నారు. అవార్డును అందుకోవడానికి రావల్సిందిగా ఇండియా టుడే గ్రూప్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పంపింది.
see also:” రైతు బీమా ” పథకం గైడ్ లైన్స్ విడుదల..!!
తెలంగాణ వ్యవసాయ శాఖ అవార్డుకు ఎంపిక కావడంపై స్పందించిన మంత్రి పొచారం ఇది ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్రం ఏర్పడి కేవలం నాలుగేళ్ళే అయినా, మన రాష్ట్రం వ్యవసాయం, రైతుల అభివృద్ది కోసం అమలు చేస్తున్న పథకాలు, చర్యలు గత 70 ఏళ్ళుగా ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికి దిక్చూచిగా మారిందనడానికి ఈ అవార్డు ఒక ఉదాహరణ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వేస్తున్న ప్రతి అడుగు రైతుల మేలు కోసమే. 24 గంటల ఉచిత విద్యుత్తు, పంట పెట్టుబడిగా ఎకరాకు రూ. 8000 ను ఇచ్చే రైతుబంధు పథకం, లక్షా యాబై వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రతి రైతుకు రూ. 5 లక్షల భీమా, బారీ సబ్సిడీలతో యంత్ర పరికరాల పంపిణీ, సూక్ష్మ బింధు సేద్యానికి అధిక నిధులు, ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం …..ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్దికి అమలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దండగన్న వ్యవసాయం పండుగ అయింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒక భరోసాను కల్పించిందన్నారు. ఇదే స్పూర్తితో రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ది కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో మరింతగా కృషి చేస్తామని మంత్రి పొచారం తెలిపారు.