ప్రపంచానికి తెలంగాణా పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్‌సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలనూ ప్రపంచానికీ తెలిపింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. ఆంధ్రలోను కేసీఆర్ నాయకత్వన్నీ అహ్వానిస్తున్నారని, భవిష్యత్ భారతానికి తెలంగాణా నుండే నాయకత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ మండల,పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ముఖ్యఅతిధిగా మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక శాసన సభ్యులు జీవన్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అతిథిగా హాజరయ్యారు.
మంత్రి జగదీశ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మకు ప్రతి రూపమే ఎంపీ కవిత అని కొనియాడారు. యావత్ ప్రపంచానికి, తెలంగాణ సమాజానికి చివరికి తెలంగాణా పదం అంటే గిట్టని వారికి ఆమె బ్రతుకమ్మ రూపంలోనే కనిపిస్తోందన్నారు. తెలంగాణా రాష్ట్రంలో పారుతున్న నిధుల వరద ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ఊహించిందేనని అన్నారు. 10 సంవత్సరాల భవిష్యత్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వేయగల సమర్ధుడని కొనియాడారు. టీఆర్ఎస్‌కు ముందు రాజకీయ పార్టీలో సభ్యత్వం అంటేనే ఎన్నికల కమిషన్ కు సమర్పించే ప్రక్రియలో బాగంగా ఉండేదని, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అనంతరం సభ్యత్వం అంటే ఇలా ఉంటుందా అన్న చర్చ తెరపైకి వచ్చిందన్నారు. తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇతర పక్షాలు కనుమరుగయ్యాయని అన్నారు. అంతో ఇంతో మిగిలింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మీదట అడ్రస్ లేకుండా టీఆర్ఎస్ శ్రేణులు పారద్రోలాలని కోరారు.
బానిసత్వానికి నిర్వచనమే కాంగ్రెస్ పార్టీ అని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అటువంటి పార్టీని ఆదరిస్తే మళ్ళీ గడ్డురోజులే పునరావృతం అవుతాయని అన్నారు. `2014 వరకు కాంగ్రెస్ ఆంధ్ర బానిస నాయకత్వంలో 2014 తరువాత ఢిల్లీ బానిస నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. నాలుగు తరాలకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉత్తరప్రదేశ్ లో ఎందుకు 24 గంటల విద్యుత్ నందించ లేక పోయింది. ఈ దేశానికి అవినీతి నేర్పింది కాంగ్రెస్ పార్టీనే …..చట్టాలకు తూట్లు పొడిచింది ఆ పార్టీ ప్రబుద్దులే. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయ వారసత్వంగా రాజకీయాలకు రాలేదు. తెలంగాణా రాష్ట్ర ఉద్యమ వారసత్వంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది. 2014కు ముందు అతి ధీనంగా, దైన్యంగా ఉన్న తెలంగాణా సమాజానికి ఆత్మ విశ్వాసం నెలకొల్పింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. నాలుగేండ్ల క్రితం వరకు తెలంగాణా పదం తెలువని రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణా పదం ఉచ్చరించకుండా ఉండలేకపోతున్నాయి. ఆయా రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలలో తెలంగాణా రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ముందు పెట్టి ఓట్లు ఆదుకునేందుకు ఆయా పార్టీలు పోటీ పడుతున్నాయి` అని మంత్రి స్పష్టం చేశారు.