పాడి రైతుల జీవితాల్లో వెలుగులు పూయించేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోనుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వ పరంగా చేయూత ఇవ్వడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపాలి అనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన పాడి పరిశ్రమ రంగంను తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం ప్రణాళికలు వేస్తున్నారని వివరించారు. పాడి పశువుల పెంపకం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు సబ్సిడీ పై పాడి పశువులు, ఆవుల పంపిణీ చేపడతామని తెలిపారు.
ఆగస్టు మొదటి వారంలో పాడి పశువుల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి తలసాని వివరించారు. కరీంనగర్, మదర్ డైరీ, ముల్కనూర్, విజయ డైరీలలో సభ్యులుగా ఉన్న 2.13 లక్షల మంది పాడి రైతులకు లబ్ది కలుగుతుందని తెలిపారు. ఈ పథకం అమలులో ఎలాంటి అవకతవకలకు వీలులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. లబ్ధిదారులు నచ్చిన ప్రాంతంలో నాణ్యమైన పాడి పశువులు, ఆవులను కొనుగోలు చేసేలా విధి విధానాలు రూపొందించామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ రంగంపై ఆధారపడి ఉన్న వారికి మేలు జరగడమే కాకుండా రాష్ట్ర అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి మన రాష్ట్రంలో నే జరుగుతుందని వివరించారు.