పంద్రాగస్టు నుంచి బీసీ, ఎంబీసీ, ఫెడరేషన్ సబ్సిడీ రుణాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంలతో కలిసి 31 జిల్లాల కలెక్టర్లతో మంత్రి జోగు రామన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం నుంచి మంత్రి జోగు రామన్న వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పంద్రాగస్టు రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో వంద మంది లబ్దిదారుల చొప్పున ఒక్కొక్కరికి రూ. 50 వేల చెక్కులను అందజేసే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆ తరువాత ఆర్థిక సాయం పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల రుణాల పంపిణీకి ప్రణాళికను రూపొందించామని, తక్షణ సాయం కింద రూ.725 కోట్లు విడుదల చేసి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అకౌంట్లో నిధులు జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సబ్సిడీ రుణాల కోసం ఎవరూ కూడా దళారుల మాటలను నమ్మవద్దని, లబ్దిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్, డీఆర్డీవో పీడీ సభ్యులుగా, బీసీ సంక్షేమాధికారి కన్వీనర్గా కమిటీ లబ్దిదారులను ఎంపిక చేస్తుందన్నారు. అత్యంత పేదవర్గాలకు, చిరు వ్యాపారులకు ఆర్థికంగా సాంత్వన కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనను అమలు చేస్తున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. సబ్సిడీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన కలెక్టర్లను కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో బీసీ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సైదా, బీసీ కార్పొరేషన్ ఎండీ ఆలోక్ కుమార్, రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.