72వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే వరంగల్ నగరంలో జరిగిన స్వాతంత్రదినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు…
సోదర, సోదరీమణులారా!
భారత స్వాతంత్ర్య దినోత్సవం మనందరికి గొప్ప పండగరోజు. పరాయిపాలన నుంచి స్వయంపాలన పొందిన చారిత్రక రోజు. ఈ 72వ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు, విద్యార్ధిని, విద్యార్ధులకు మరియు మీడియా మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అమరవీరులకు, త్యాగమూర్తులకు నా జోహార్లు.
స్వతంత్ర్యభారత దేశంలో తెలంగాణ ప్రాంతం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలు ఉద్యమించింది. ఈ ఉద్యమంలో మలిదశ పోరాటం కేసిఆర్ నాయకత్వంలో ఫలించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 2014 జూన్ 2న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే లక్ష్యంతో అన్ని వర్గాల వాళ్ల సమగ్ర వికాసం కోసం సిఎం కేసిఆర్ వినూత్న పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలు నేడు దేశ, విదేశాల్లోని ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నాయి.
వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం, సాగు మరియు తాగునీరు, పరిశ్రమలు, ఐ.టి. రంగాలలో తెలంగాణ దేశంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ పలు రికార్డులను సొంతం చేసుకుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలు మన పథకాలను అధ్యయనం చేసి వారి దగ్గర అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
వ్యవసాయం :
వ్యవసాయాన్ని పండుగ చేయాలని, రైతును రాజును చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో అమలవుతున్న పథకాలు నేడు రైతు ముఖంలో చిరునవ్వును చిందిస్తున్నాయి. దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేసి చూపుతున్న చేతల ప్రభుత్వం మనది. వలసలు నివారించి, పేదరికాన్ని నిర్మూలించి చేతి వృత్తులు, కుల వృత్తులు, కుటుంబ పరిశ్రమలకు జీవం పోయాలని ప్రభుత్వం ఆశయం ఆచరణలో మన కళ్ల ముందు కనిపిస్తుంది.
రైతుల ఆత్మహత్యలకు అప్పులే కారణమని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టో లో రుణమాఫీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట మేరకు 17వేల కోట్ల రూపాయల అప్పులను 4 దఫాలుగా మాఫి చేసి 35 లక్షల మంది రైతులను రుణ విముక్తం చేసింది. తెలంగాణలో ఎరువులు, విత్తనాల కోసం రైతులకు పడిగాపుల అవసరం లేకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. గత ప్రభుత్వాల్లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, రాదో తెలియని పరిస్థితిని మార్చి తెలంగాణలో నిరంతర విద్యుత్ సాధించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
రైతుబంధు పథకం :
ఇంతటితో సంతృప్తి చెందకుండా రైతుకు ఇంకా ఏం చేయాలని ఆలోచించిన సిఎం కేసిఆర్..వర్షాకాలం వస్తే పంట పెట్టుబడికి అప్పుకోసం చేతులుసాచే పరిస్థితిని మార్చాలనుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు పంట పెట్టుబడి ఇచ్చే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఎకరాకు ఏటా ఎనిమిది వేల రూపాయలు పంట పెట్టుబడి ప్రకటించారు. మొదటి విడతలో ఎకరానికి 4000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని 50.08 లక్షల మంది రైతులకు 5,164 కోట్ల రూపాయలు పంట పెట్టుబడి కింద పంపిణీ చేసుకున్నాం.
భూరికార్డుల ప్రక్షాళన :
భూతగాదాలకు ప్రధాన కారణం భూరికార్డుల్లోని లోపాలేనని గుర్తించిన సిఎం కేసిఆర్ వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలోని భూరికార్డులను వంద రోజులలోనే 96 శాతం ప్రక్షాళన చేసి రికార్డు సృష్టించారు. రైతులకు పాస్ పోర్ట్ వంటి పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. రాష్ట్రంలోని 2 కోట్ల 38 లక్షల ఎకరాల భూమికి సంబంధించి రికార్డులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి కోటి 56 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వివరాలలో స్పష్టత తీసుకురావడం జరిగింది. కోటి 40 లక్షల ఎకరాల భూములకు పట్టాదార్ పుస్తకాలు ఇచ్చారు.
రైతుబీమా పథకం :
దురదృష్టవశాత్తు రైతు కాలధర్మం చేస్తే ఆయన కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలని సిఎం కేసిఆర్ గొప్ప ఆలోచనే రైతు బీమా పథకం. రూపొందించారు. రాష్ట్రంలోని 18 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి రైతుకు రైతు బీమా పథకం కింద 2271 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించి రాష్ట్రంలో 27 లక్షల మంది రైతులకు మరియు జిల్లాలొ 43 వేల 510 మంది రైతులకు రైతు బీమా పథకం ఈ నెల 14వ తారీకు అర్ధరాత్రి నుండి అమలయ్యే విధంగా రైతు జీవిత బీమా పత్రాలను అందజేయడం జరుగుతుంది. ప్రమాదవశాత్తు రైతు చనిపోయిన 10 రోజులలోనే 5 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు బీమా కంపెని చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం.
సాగునీటి ప్రాజెక్టులు :
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అని మూడు ప్రధాన అంశాలపై ఉవ్వెత్తున ఉప్పొంగింది. 2014 లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అంశం నీళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ప్రాజెక్టులను రీ-డిజైనింగ్ చేసి రాష్ట్రంలోని 23 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా పూర్వపు వరంగల్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఏకైక లక్ష్యంతో ఎస్సారెస్సీ మరియు దేవాదుల ప్రాజెక్టు మొదటి, రెండు, మూడో విడత పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ప్రాజెక్టు క్రింద ఉన్న రిజర్వాయర్లను పూర్తి చేయడం జరిగింది.
లింగంపల్లి రిజర్వాయర్ :
10.78 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో లింగంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3227 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లు పిలవడం జరిగింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు వరంగల్ పట్టణానికి తాగునీరు అందించడానికి మార్గం సుగమం అవుతుంది.
గోదావరి నదిపై మరొక మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా పూర్వపు వరంగల్ జిల్లా మొదటగా లబ్ది పొందనుంది.
మిషన్ కాకతీయ :
గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువులను పునరుద్ధరించి, తెలంగాణలోని గొలుసుచెరువులకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో చేపట్టిన మిషన్ కాకతీయ దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందింది. రాష్ట్రంలోని 46 వేల చెరువులను పునరుద్ధరించేందుకు గత నాలుగు విడుతలు పూర్తి చేసి ఐదో విడత పనులు జరుగుతున్నాయి. మిషన్ కాకతీయలో చెరువులు నింపడం వల్ల వాటి కింద వ్యవసాయ భూములు పచ్చని పొలాలుగా మారి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5839 చెరువులను మిషన్ కాకతీయ పథకం క్రింద పునరుద్ధరించడం ద్వారా 3.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది.
హరితహారం :
అంతరించి పోతున్న అటవీ సంపదను పెంపొందించి వాతావరణ సమతుల్యతను కాపాడి, భావితరాల మంచి భవిష్యత్ ఇవ్వాలనే గొప్ప లక్ష్యంతో సిఎం కేసిఆర్ రూపొందించిన మరొక మంచి పథకం హరితహారం. ప్రస్తుతం ఉన్న 24 శాతం అటవీ సంపదను 33 శాతానికి పెంపొందించుటకు 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంతో గత మూడు విడతలుగా 81.60 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. నాల్గవ విడతలో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నాం. వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ సంవత్సరం 62 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలి. సామాజిక అడవుల పెంపకానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
మిషన్ భగీరథ :
2018 చివరి నాటికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చారిత్రాత్మక శపథం చేసి సి.ఎం. కే.సి.ఆర్. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోడి చేతుల మీదుగా ప్రారంభించారు. నేడు రాష్ట్రంలోని 10 నూతన జిల్లాల్లో మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించి ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీరు అందించడం జరుగుతుంది. మిగతా జిల్లాల్లో డిసెంబర్ చివరి నాటికి మిషన్ భగీరథ పథకం క్రింద ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దసరా పండుగ లోగా మిషన్ భగీరథ నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నాం.
దేశానికే మోడల్ గా తెలంగాణ విద్య :
సహజ వనరులతో పాటు మానవ వనరుల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని నమ్మిన సి.ఎం. కేసిఆర్ రాష్ట్రంలో 570 గురుకుల పాఠశాలలు, 53 డిగ్రీ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ప్రపంచంలో ఎవరికీ తీసుపోకుండా ఉండే నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం మరో 119 బిసి గురుకులాలను ప్రారంభించాలని సిఎం కేసిఆర్ ఇప్పటికే నిర్ణయించారు. గురుకులాలకు భవనాలు, మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ఒక్కో విద్యార్థిపై లక్షా 20వేల రూపాయల చొప్పున, ప్రతి ఏటా గురుకులాలపై 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది.
స్కూళ్లలో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ :
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే 6 లక్షల బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ మరియు హైజీన్స్ కిట్స్ అందిస్తున్నాం. ఏటా వంద కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ పథకం దేశంమొత్తంలో తెలంగాణలోనే అమలవుతున్న మంచి పథకం. బాల్యవివాహాలను అరికట్టి, బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రభుత్వం సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్(కేబ్) సబ్ కమిటికి నన్ను చైర్మన్ గా వేసింది. ఈ కమిటీ చైర్మన్ గా ఇచ్చిన నివేదికలోదేశంలోని కేజిబివిలను 12వ తరగతి వరకు కొనసాగించాలని చేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో ఈ ఏడాది నుంచి కేజిబివిలు 12వ తరగతి వరకు విద్యనందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసుకోవడంతో, ఏర్పాటైన కొత్త జిల్లాలు, మండలాల్లో అదనపు కేజీబీవీలు కావాలని కోరితే రాష్ట్రానికి 84 కేజిబివిలు అదనంగా వచ్చాయి. ఈ ఏడాది 88 కేజీబీవీలు జూనియర్ కాలేజీలు అయ్యాయి.
ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టం చేసేందుకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్య, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ క్లాసెస్, ఇంగ్లీష్ మీడియంలో బోధన, ల్యాబ్ వసతులు కల్పించడం ద్వారా పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు గణనీయంగా పెరిగింది. గత నాలుగు సంవత్సరాలుగా తీసుకున్న చర్యలతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి.
విదేశాలలో చదివే విద్యార్ధులకు స్కాలర్ షిప్ పథకం క్రింద 20 లక్షల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుంది. విద్యార్ధులు వివిధ పోటీ పరీక్షల్లో ధీటుగా ఎదుర్కోవడానికి వీలుగా స్టడీ సెంటర్లను బలోపేతం చేసి శిక్షణ ఇవ్వడం ద్వారా దేశంలోని అన్ని పోటీ పరీక్షలలో తెలంగాణ విద్యార్ధులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
కంటివెలుగు :
రాష్ట్రంలోని 3.50 కోట్ల ప్రజానికానికి కంటి పరీక్షలు చేసి అవసరమైన పరికరాలు అందించడంతో పాటు శస్త్ర చికిత్స కూడా చేయడం ద్వారా అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఇందుకు గాను రాష్ట్రంలో 799 బృందాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక్కొక్క బృందం ద్వారా గ్రామంలో 250 మంది, పట్టణాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించి స్థానికంగా అవసరమైన పరికరాలు అందించడంతో పాటు శస్త్ర చికిత్స అవసరమైన వారికి రెఫరెల్ ఆసుపత్రికి పంపించనున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము.
గర్భంతో ఉన్న సమయంలో ఆడపడుచులు పనిచేసి కుటుంబాన్ని పోషించవలసిన దుస్థితిని దూరం చేయాలని సి.ఎం. కే.సి.ఆర్. మానవీయ కోణంలో ఆలోచించి కేసిఆర్ కిట్ పథకం కింద గర్భిణీలకు 12 వేల రూపాయలు ఆర్ధిక సహాయం, ఆడపిల్ల పుడితే అదనంగా మరొక వెయ్యి రూపాయలు ప్రోత్సాహకంగ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన వారికి తల్లి, బిడ్డలకు అవసరమైన అన్ని వస్తువులతో కూడిన కేసిఆర్ కిట్ ను అందిస్తున్నాము. తద్వారా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు రెండు లక్షల 12 వేల మందికి, జిల్లాలో 16 వేల 642 మందికి ప్రయోజనం చేకూరింది.
వరంగల్ కేంద్రంగా సూపర్ స్పెషాలిటి హాస్పటల్ నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వరంగల్ ను సాహితీ, సంస్కృతి హబ్ గా తీర్చిదిద్దుటకు హన్మకొండలో 50 కోట్ల రూపాయల వ్యయంతో కాలోజీ కళాక్షేత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రాష్ట్రంలో 39 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా డయాలసిస్ సౌకర్యం అందుబాటులో తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలోని దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయి హెల్త్ స్కీం, జర్నలిస్టులకు జర్నలిస్ట్ హెల్త్ పథకాల క్రింద ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది.
నవ్య వరంగల్ :
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రతి ఏటా బడ్జెట్ లో రూ.300 కోట్లు కేటాయించడం జరుగుతుంది. వరంగల్ నగరాన్ని ఎడ్యుకేషన్, ఐ.టి. హబ్ గా, టెక్స్ టైల్ హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు వరంగల్ పబ్లిక్ స్కూల్, అగ్రికల్చర్ కళాశాల, వెటర్నరి కళాశాల, సైనిక్ స్కూల్ లతో పాటు కాళోజి హెల్త్ యూనివర్సిటి కేంద్రంగా విద్యను అందిస్తున్నాం. అదేవిధంగా నూతనంగా పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ఐటి కంపెనీలు వరంగల్ కేంద్రంగా వస్తున్నాయి. రైల్వే వ్యాగన్ ఓవరాలింగ్ యూనిట్ కేంద్రంగా ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఆసియాలోనే అతి పెద్ద వస్త్ర నగరిగా వరంగల్ ను తీర్చిదిద్దుటకు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో ఫాం టు ఫ్యాషన్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్ నినాదంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నాం. చేనేతకు చేయూత ఇవ్వడానికి, వస్త్ర ఉత్పత్తికి పట్టు కొమ్మగా వెలుగొందిన వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సంతరించుకోవడంతో పాటు వస్త్ర రంగానికి అపూర్వ కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. చేనేత కార్మికులతో పాటు ఇతర వర్గాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 20 వేల మందికి ఉపాధి లభించనుంది. రెండు దశలలో సుమారు రెండు వేల ఎకరాల్లో విస్తరించనున్న ఈ టెక్స్ టైల్ పార్కులో దాదాపు 12 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి. ఇప్పటికే 12 కంపెనీలు 3000 కోట్ల రూపాయల పెట్టుబడితో శంకుస్థాపన రోజున ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది.
నగరాభివృద్దిలో రోడ్లు చాలా కీలకం. హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం ద్వారా సిటి స్వరూపం పూర్తిగా మారిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. అదే తరహాలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేయడం జరిగింది. వరంగల్ నగరం చుట్టూ జాతీయ రహదారిని అనుసంధానం చేసుకొని 74 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి 1446 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ఓ.ఆర్.ఆర్. మంజూరు చేయడం జరిగింది. ఇందులో మొదటి దశ పనులకు గాను 669 కోట్ల రూపాయలపనులు చేపట్టడం కోసం అనుమతి ఇవ్వడం జరిగింది.
హైదరాబాద్, వరంగల్ రోడ్డు జాతీయ రహదారిగా నాలుగు లైన్లతో అభివృద్ది జరుగుతున్న తరుణంలో ఖాజీపేట, హన్మకొండ మధ్యలో వారధిగా ఆర్.ఓ.బికి సమాంతరంగా మరొక ఆర్.ఓ.బి. కావాలన్న ఇక్కడి ప్రజల దశాబ్దాల అభిలాష తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరింది. ఈ ఆర్.ఓ.బి నిర్మాణానికి అవసరమయ్యే 78 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసిఆర్ మంజూరు చేశారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాను బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దుటకు ప్రతి ఇంట్లో మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది. స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ కార్పోరేషన్ కు దేశంలోని 4500 నగరాల్లో 39వ ర్యాంకు సాధించడం జరిగింది.
జిల్లాలో చారిత్రాత్మక కట్టడాలైన వరంగల్ కోట, వెయ్యి స్తంభాల గుడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయుటకు ధర్మసాగర్ ఇనుపరాతి గుట్ట, ఎల్కతుర్తి ఉర్సుగుట్ట, కొత్తకొండ, ఐనఓలు, భద్రకాళి, అగ్గలయ్య గుట్టలను అభివృద్ది చేసి పర్యాటకులను ఆకర్షించుటకు చర్యలు చేపట్టడం జరుగుతుంది.
కులవృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సంవత్సరం రాష్ట్రంలో 2 లక్షల 13 వేల మందికి జిల్లాలో 13 వేల 859 మందికి పాడి గేదెలు / ఆవులు పంపిణీ చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి గొర్రెలు పంపిణీ చేయుటకు 75 శాతం సబ్సిడీ ద్వారా 20 గొర్రెలతో పాటు ఒక పొట్టేలును అందించడం జరుగుతుంది. జిల్లాలో 69 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయంతో 11వేల 397 మంది కుటుంబాలను గుర్తించి గత సంవత్సరం 5653 కుటుంబాలకు లక్ష గొర్రెలు పంపిణీ చేశాం. మిగిలిన అర్హులైన లబ్దిదారులకు గొర్రెల పంపిణీకి చర్యలు చేపడుతున్నాం.
వరంగల్ జిల్లాలోని 476 చెరువులలో సుమారు 1.50 కోట్ల చేప పిల్లలను ఉచితంగా సరఫరా చేయడం వల్ల దాదాపు 10 వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్ధిక లబ్ది చేకూరింది. మత్స్యకారులకు చేపల విక్రయం కోసం ట్రాలీలు, ద్విచక్ర వాహనాలు అందజేస్తున్నాం.
నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారంగా కావద్దని సిఎం కేసిఆర్ కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులకు లక్షా 116 రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం. జిల్లాలో 6702 మంది నూతన దంపతులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద 41 కోట్ల 74 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది.
ఆసరా పథకం కింద జిల్లాలో లక్షా 249 మంది వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, బీడి కార్మికులు మరియు ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు నెలకు 1500 రూపాయలు చొప్పున అందించడం జరుగుతున్నది. ఉపాధి హామీ పథకం క్రింద 10 వేల కుటుంబాలకు పని కల్పిస్తూ ఇప్పటికే 11.5 కోట్ల రూపాయలు కూలీలకు వేతనంగా అందించడంతో పాటు సుమారు మూడు కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు చేయడం జరిగింది. జిల్లాలోని మహిళా సంఘాలకు 10.81 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజి రుణాలు, స్త్రీ నిధి కింద మహిళా సంఘాలకు 2.81 కోట్ల నిధి రుణాలు అందించడం జరిగింది.
ఆహార భద్రత కార్డుల ద్వారా జిల్లాలో 2.53 లక్షల కార్డుదారులకు ఒక రూపాయికే కిలో బియ్యం చొప్పున నెలకు ఆరు కిలోలు పంపిణీ చేయడం జరుగుతుంది.
వరంగల్ అర్బన్ జిల్లాను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. నిరంతరం సమావేశాలు, సమీక్షలు చేస్తున్నాం. మానవ వనరుల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమన్న సిఎం కేసిఆర్ లక్ష్యానికనుగుణంగా ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, ఉపాధి, మౌలిక వసతులు కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. హరిత తెలంగాణ, అక్షర తెలంగాణ, బంగారు తెలంగాణగా మన రాష్ట్రాన్ని దేశంలో రోల్ మోడల్ గా మార్చుకున్నాం.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో నిరంతరం పాలుపంచుకుంటున్న రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూధనా చారి గారికి, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారికి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందులాల్ గారికి, పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారికి, బండ ప్రకాష్ గారికి, సీతారాంనాయక్ గారికి, పసునూరి దయాకర్ గారికి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మ గారికి, నగర మేయర్ నన్నపునేని నరేందర్ గారికి, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి గారికి, శాసనమండలి, శాసనసభ్యులకు,వివిధ కార్పోరేషన్ల చైర్మన్లకు, కార్పోరేటర్లు, జెడ్పీటిసిలు, ఎం.పి.పి.లు మరియు ఎం.పి.టి.సి.లకు నా ధన్యవాదాలు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే విధంగా, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, పోలీస్ కమీషనర్ రవీందర్, మున్సిపల్ కమీషనర్ గౌతం మరియు ఇతర అధికారులకు మరోసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణ
జై హింద్
మీ……
కడియం శ్రీహరి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి &
విద్యా శాఖామాత్యులు.