ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు, ఇతర కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలిసి చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వినతులు చేసినా, కేంద్రం నుంచి ఆశించిన స్పందన రావడం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తానే స్వయంగా వెళ్ళి అవసరమైతే ఢిల్లీలోనే రెండు మూడు రోజులుండి, ప్రధాని, ఇతర మంత్రులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని సిఎం నిర్ణయించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పటు చేసుకున్న జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించకపోవడంతో పంచాయితీ కార్యదర్శుల నియామకంతో పాటు మరికొన్ని నియామకాల్లో జాప్యం జరుగుతోంది. జోనల్ వ్యవస్థకు తక్షణం ఆమోద ముద్ర వేయించే విషయంలో ప్రధాని చొరవ చూపాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలోనే ఉండి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సమీక్షిస్తున్నారు. అయినా ఆశించిన ఫలితం రావడం లేదు. దీంతో సిఎం స్వయంగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. జోనల్ వ్యవస్థతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అదనపు ఎఫ్.ఆర్.బి.ఎం. నిధుల విడుదల, వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల నిధుల విడుదల, మహిళా సంఘాలు, రైతులకు ఇచ్చే రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీలో కేంద్ర ప్రభుత్వ వాటా విడుదల, హైకోర్టు విభజన, రీజనల్ రింగు రోడ్డుకు నిధులు, సెక్రటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపు తదితర అంశాలపై ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో మాట్లాడి రావాలని సిఎం నిర్ణయించారు. ఈ సారి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించాలని సిఎం భావిస్తున్నారు. వెంటనే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పరిష్కారానికి పిఎంఓ చొరవ చూపాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరనున్నారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు.
