ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో పోలిస్తే స్వాతంత్య్రానికి పూర్వ బ్రిటీష్ వాళ్లే నయమనిపిస్తోందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా విమర్శించారు. బాబుపాలనలో మహిళలకు రక్షణలేదని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి 2014లో మహిళలంతా రాఖీ కట్టి అధికారం అప్పగిస్తే ఆరేళ్ల పసిబాలిక మొదలు ఆరవైఏళ్ల ముదుసలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారన్నారు. రిషితేశ్వరి, ఎమ్మార్వో వనజాక్షి ఇలామహిళలు టీడీపీ పాలనలో బాధితులుగా ఉన్నారని దుమ్మెత్తిపోశారు. కాల్‌మనీ ఘటనల్లో మహిళలకు ఇప్పటివరకూ న్యాయం జరగలేదని, టీడీపీకి చెందిన నేతలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిపరంగా కంటే మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడుల వంటి విషయంలో రాష్ట్రం డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందని రోజా ఎద్దేవాచేశారు. 2019లో ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికలు ఎదుర్కొంటామని తమ అధినేత జగన్ ఇప్పటికే ప్రకటించారని, సాయం లేకుండా ఒంటరిగా పోటీచేస్తామని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు.
