తెలంగాణ రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రాష్ట్రాలతోపాటే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ప్రచారాన్నిఅత్యంత వేగంగా , బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా సభలే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో రెండేసి చొప్పున సభలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు షెడ్యూల్ తయారు చేసుకున్నారు. 50 రోజులు 100 సభలు అంటున్నారు.
ఇందులో బాగంగానే శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగే తొలి బహిరంగసభలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. గురువారం రాత్రి సభాప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఎన్నికల ప్రచారాన్ని కూడా హుస్నాబాద్‌లోనే ప్రారంభించి రాష్ట్రంలో గులాబీ జెండాను ఎగురవేశామని చెప్పారు. ఈసారి కూడా ఇక్కడినుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని అన్నారు. హుస్నాబాద్ పట్టణం నుంచే సుమారు పదివేల మంది పాదయాత్ర ద్వారా సభకు వస్తారన్నారు. చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల ప్రజలు కూడా పాదయాత్ర ద్వారా సభకు చేరుకుంటారని తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువమంది ప్రజలు సభకు తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలుపుతారని హరీశ్‌రావు చెప్పారు.