ముందస్తు ఎన్నికల వేళ రాష్ర్టమంతటా ఒకలాంటి పరిస్థితి ఉంటే సిద్దిపేట నియోజకవర్గంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే సీన్ రివర్స్ అయినట్లు అర్థమవుతున్నది. ఈ సమయంలో అభ్యర్థులంతా ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు పనిగట్టుకొని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటా తిరిగి దండాలు పెడుతున్నారు. మా గుర్తుకే ఓటెయ్యాలంటూ వేడుకుంటున్నారు.
కాని సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న హరీశ్ రావు మాత్రం తనంతట తానుగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. ప్రజలు, కులసంఘాలు, అసోసియేషన్లు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలకు ఆహ్వానిస్తేనే వెళుతున్నారు. వారందించే ఏకగ్రీవ తీర్మాణ పత్రాలు, ఎన్నికల కోసం అందించే ఖర్చులను తన వెంట తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాలలో హరీశన్న అనే అభిమానం ఆకాశానికి చేరింది. ఇప్పటికే కొన్ని గ్రామాలు మూకుమ్మడిగా ఏకగ్రీవ తీర్మాణాలు చేసి హరీశ్ రావు గారిని గ్రామాల్లోకి ఆహ్వానించి మాట ఇచ్చారు.
ఈ గ్రామాల బాటలోనే మిగితా గ్రామాలు కూడా సై అంటున్నాయి. ఇప్పటికే హరీశ్ రావు గారికి మా ఊరికి రావాలంటూ ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే మరో 10 గ్రామాలు ఏకగ్రీవ తీర్మాణాలకు సిద్దమైనట్లు కనిపిస్తున్నది. ఇక హరీశ్ రావు గారిని గ్రామాల్లోకి పిలిచి, మాట ఇచ్చి పంపించడం కాదు.. గ్రామంలో అడుగుపెట్టిన సందర్భం నుంచి నీరాజనాలు పలికి బ్రహ్మరథం పడుతున్నారు. పేరుపేరున ఓటేస్తామంటూ మనస్పూర్థిగా చెపుతున్నారు. మా ఓటు మా హరీశన్నకే అంటూ ప్రతిజ్ఞలతో మార్మోగిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.