విలేకరులమంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు నిన్న ధర్మపురిలో ఎన్నికల గురించి సర్వే చేస్తుండగా వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మినిస్టర్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నమ్మడం లేదు. కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు. విలేకరులమని చెప్పిన వారిని స్థానిక యువకులు గట్టిగా ప్రశ్నిస్తే తాము ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులమని వారు చెప్పారు. నిన్న సర్వే చేసిన ఏపీ పోలీసుల వివరాలన్నీ తమతో ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతీ నాయకుడి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని కేటీఆర్ పేర్కొన్నారు. తమ వాహనాన్ని తనిఖీ చేసినా అభ్యంతరం లేదన్నారు. తెలంగాణలో పైసలు పంచడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తెలంగాణలో అరాచకానికి చంద్రబాబు పూనుకుంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు కేటీఆర్. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులతో తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయిస్తున్నారు. ఏపీ ప్రజల సొమ్ములతో చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అక్కడి పైసలతో ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. 500 కోట్లతో చంద్రబాబు.. రాహుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ లేదు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి గత ఎన్నికల్లో ఆయన ఇన్నోవా కారులో రూ.3 కోట్లు కాల్చుకున్నాడు. చిల్లర మల్లర రాజకీయాల కోసం పోలీసులను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.