టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఏర్పాటు చేసిన తెలంగాణ మహాకూటమి ఆదిలోనే అబాసుపాలు అవుతోంది. తాము రంగంలోకి దిగితే…సీన్ మారుతుందని ప్రకటించుకుంటున్న కూటమికి…ఆదిలోనే సీన్ సితార అవుతోంది. ఓ వైపు సీట్లు మరోవైపు నియోజకవర్గాల కేటాయింపు విషయంలో వివాదం కొనసాగుతుండగా, మరోవైపు మిత్రపక్షాలు తమ బ్లాక్‌మెయిల్‌ను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఏకంగా టీజెఎస్ వాకౌట్ చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపై ఢిల్లీ వేదికగా అధిష్టానం ముమ్మర కసరత్తు చేసి మిత్రపక్షాలకు కేటాయించాల్సిన స్థానాలు, సామాజికవర్గాల వారిగా ప్రాతినిధ్యంపై సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే. అయితే, అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా లీకులు ఇవ్వడం, అవి తమకు ఆమోదయోగ్యంగా లేని క్రమంలో సీపీఐ, టీజేఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమకు మరిన్ని సీట్లు కావాలంటున్న టీజేఎస్ కాంగ్రెస్‌కు డెడ్‌లైన్ విధించింది. అయితే, ఈ డెడ్‌లైన్ అనంతరం జరిగిన పరిణామాలు కూటమిని చీలిక దిశగా తీసుకువెళతాయనే అభిప్రాయాన్ని కలిగించింది. సాయంత్రంలోగా సీట్ల ఖరారుపై స్పష్టత ఇవ్వకపోతే సాయంత్రం కోర్‌కమిటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కలవరపాటుకు గురైంది. పార్క్ హయత్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూటమి నేతలతో భేటీ అవగా రు. కూటమి భాగస్వామ్య పార్టీ ల తరుపున హాజరైన కోదండరాంతో చర్చించారు. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెళ్లిపోయారు. కాగా, ఈ సమావేశం నుంచి కూడా కోదండరాం అర్ధాంతరంగా వెళ్లిపోయారు. చర్చల్లో పురోగతి లేదని పేర్కొంటూ కోదండరాం మధ్యలోనే వెళ్లిపోయారు. రేపు మరోసారి కూటమి సమావేశం కానుందని, అప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.