పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు రాములునాయక్, కే యాదవరెడ్డి, ఆర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటువేస్తూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముగ్గురిపై అనర్హత వేటువేస్తూ బుధవారం మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు బులిటెన్ విడుదలచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు రాములునాయక్, కే యాదవరెడ్డి, ఆర్ భూపతిరెడ్డి, కొండా మురళి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, భూపతిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచే యగా, మిగిలిన ముగ్గురు ఆ పార్టీ తరఫున ప్రచారంచేశారు. ఈ నేపథ్యంలో వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు టీఆర్‌ఎస్ ఫిర్యాదుచేసింది. దీంతో వీరికి చైర్మన్ నోటీసులు జారీచేయగా, కొండా మురళి తన పదవికి రాజీనామాచేశారు. మిగిలిన ముగ్గురు తమ వాదనలు వినిపించడానికి మరికొంత సమయం కోరారు. వారికి సమయం ఇచ్చి వారి వాదనలు విన్నారు. టీఆర్‌ఎస్ తరఫున వాదనలు వినిపించారు. సాక్ష్యాలను సమర్పించారు.
కాగా, ఈ ముగ్గురిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ ముగ్గురి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భ్రమపడి.. ఎన్నికల సమయంలో ఈ ఎమ్మెల్సీలు పార్టీ మారారు. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు సరికదా…అటు పార్టీ ఫిరాయింపుపై టీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఉన్న పదవి ఊడిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి వారికే అర్థం కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్సీల పరిస్థితి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి ఓ పాఠం వంటిదని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.