యాక్షన్‌కు రియాక్షన్ తరహాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తగు రీతిలో స్పందించేందుకు టీఆర్‌ఎస్ కార్యాచరణ ప్రారంభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పోషించిన పాత్రకు తగిన రిటర్న్‌గిఫ్ట్ ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చేలా వ్యూహం ఖరారైంది. ఇందులో తొలి మెట్టుగా టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ రెండు రోజుల క్రితం ఆంధ్ర పర్యటనతో మొదలైంది. అనంతరం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీతో మరో అడుగు పడింది.
ఈ ఎపిసోడ్‌కు కొనసాగింపుగా త్వరలో గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారని సమాచారం. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్నందున అప్పటికల్లా టీఆర్‌ఎస్ మరింత పకడ్బందీ వ్యూహాన్నిరూపొందించనుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇప్పటికే అక్కడి యాదవ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని టీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చెప్పినట్లుగా చంద్రబాబుకు రిటర్న్‌గిఫ్ట్ తథ్యమని, తన వంతు పాత్ర పోషిస్తానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత భీమవరం పర్యటనలో పోలవరం ప్రాజెక్టుపై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం కెసిఆర్ రిటర్న్‌గిఫ్ట్ వ్యాఖ్యలపై స్పందించి తాను కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి హైదరాబాద్ వచ్చి అసదుద్దీన్ ఒవైసీని కలిసి చర్చించారు.
ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌తో హైదరాబాద్‌లో చర్చ లు జరిపారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యామ్నాయంలో భాగంగా వైఎస్‌ఆర్‌సిపి మద్దతును కోరారు. కాంగ్రెస్, బిజెపిలు లేని కూటమికి మద్దతుపై చర్చించారు. త్వరలో ఈ చర్చల కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న కేసీఆర్ విజయవాడలో జగన్‌తో సమావేశం కానున్నారు. ఈ ఎపిసోడ్ నేపథ్యంలోనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.