తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మక సంస్థల రాక కొనసాగుతోంది. తాజాగా, దక్షిణ కొరియాకు చెందిన అసెట్ మేనేజ్‌మెంట్ సేవల సంస్థ మిరే అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ.. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది ఈ రంగంలో సేవలు ఆరంభించిన సంస్థ.. ఇక్కడే బిజినెస్ పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ హైదరాబాద్‌తోపాటు పుణె, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో ఏదో ఒక నగరంలో ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి(సీఈవో) స్వరూప్ మోహంతి సంకేతాలిచ్చారు.
కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి(సీఈవో) స్వరూప్ మోహంతి మాట్లాడుతూ ఇప్పటికే రెండు బిజినెస్ పార్క్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని, మరోకటి అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో ప్రాజెక్టు కోసం రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ బిజినెస్ పార్క్ ఏర్పాటులో హైదరాబాద్‌కు అత్యంత ప్రాధాన్యతనివ్వనున్నట్లు ప్రకటించిన ఆయన పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. రాష్ట్రంలో అసెట్ మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా పెట్టుబడులు పెడుతున్నారని, గతేడాది రూ.728 కోట్లు ఇన్వెస్ట్ చేశారని, ఈ ఏడాది ఇది వెయ్యి కోట్ల రూపాయలు దాటనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 నగరాల్లో సేవలు అందిస్తుండగా, వచ్చే రెండేండ్లలో 30 నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రూ.23,500 కోట్లుగా ఉన్న అసెట్ మేనేజ్‌మెంట్ ఆస్తులు ఈ ఏడాది చివరినాటికి రూ.40 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు.