ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడిగా సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని చంద్రబాబు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది . నిబంధనల ప్రకారం నెల రోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్నా ఇంత వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు తీసుకోలేదు సండ్ర వెంకటవీరయ్య. బాధ్యతలు స్వీకరించకపోవడంతో పాలక మండలి నుంచి ఏపీ సర్కార్ తొలగించింది.
ఇదిలాఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగి సత్తుపల్లి నియోజకవర్గంలో విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య… ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రచారాన్ని ఆయన ఖండించినా.. తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో సండ్ర కారు ఎక్కడం పక్కా అనే ప్రచారం మరోసారి జోరుగా సాగుతోంది. దీంతో టీటీడీ పాలకమండలిలో సండ్ర సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే, చంద్రబాబు ఇచ్చిన ట్విస్ట్‌కు సండ్ర వెంకట వీరయ్య రిటర్న్ ట్విస్ట్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. గులాబీ గూటికి చేరడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. తద్వారా టీడీపీ తరఫున గెలచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీని వీడటం ఖాయమంటున్నారు.