ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చారిత్రకంగా ఏనాడు లేనంత ఇబ్బందికర స్థితిలో ఉన్నారా? బాబు ఆలోచన దోరణి, ఆయన స్వార్థపూరిత రాజకీయాలతో ఇతర పార్టీల నేతలు విసిగెత్తిపోయారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే! అయితే బీజేపీ.. లేకుంటే కమ్యూనిస్టులు.. చివరకు మొన్న తెలంగాణలో కాంగ్రెస్‌తోకూడా కలిసి పోటీచేసిన ఘనత వహించిన చంద్రబాబునాయుడు.. ఈసారి ఏపీలో మొదటిసారి ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు.
ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన నాటి నుంచి కూడా టీడీపీ ఒంటరిగా పోటీచేయలేదు. పార్టీ బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లోనే సంజయ్ విచార్‌మంచ్‌తో పోటీ పెట్టుకుంది. అప్పటినుంచీ టీడీపీ పొత్తు రాజకీయాలతోనే పబ్బం గడుపుకుంటూ వస్తున్నది. టీడీపీ నాయకత్వం ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగే సాహసం ఏనాడూ చేయలేదు. చంద్రబాబు ఆధ్వర్యంలో తొలిసారిగా 1999 ఎన్నికల్లో పోటీచేసిన ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. ఆ ఎన్నికల్లో వాజ్‌పేయి ప్రభతో ఇక్కడ చంద్రబాబు గట్టెక్కారు. ఆపై అలిపిరి ఘటన తర్వాత తనతోపాటు కేంద్రంలోని ఎన్డీయేను కూడా ముందస్తుకు నడిపించి.. బొక్కబోర్లా పడ్డారు. 2004 ఎన్నికల్లో బీజేపీతోనే జట్టుకట్టి పోటీచేసిన ఆయన ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని.. ఓటమి నెపాన్ని బీజేపీపైకి నెట్టారు. తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 2009 ఎన్నికలను ఎదుర్కొన్న బాబు నేతృత్వంలోని తెలుగుదేశం మహా కూటమితో కలిసి ఎన్నికల్లోకి వెళ్లింది. టీఆర్‌ఎస్, వామపక్షాలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నారు.
గత ఎన్నికల్లో బీఏపీ-జనసేన పార్టీతో కలిసి బరిలో దిగి బొటాబొటి మెజార్టీతో గెలుపొందింది. తాజాగా ఒంటరిపోరాటం చేస్తున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒంటరిపోరు చంద్రబాబుకు కలిసివస్తుందా? లేదా? అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.